Wedding Season : భారత్ లో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రంగా చూస్తారు. పుట్టుక, పెళ్లి, పిల్లలు, వృద్ధాప్యం అనేవి భారతీయుల జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో పెళ్లి వేడుకకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో పెళ్లి మాత్రమే అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఎవరి స్థోమతను బట్టి వారు వివాహ వేడుకలకు ఖర్చు చేస్తారు. అందుకే ‘‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’’ అని పెద్దలు చెబుతుంటారు. ఇల్లు కట్టడం ఎంత కష్టమో..పెళ్లి కూడా అంతే కష్టం. ఇక ఆడబిడ్డల తండ్రికైతే ఎంత కష్టం. ఆడ పిల్లల తండ్రులు వారు పుట్టినప్పటి నుంచి వారి పెళ్లి కోసం డబ్బులు పొదుపు చేస్తుంటారు.
భారత మార్కెట్ లో పెళ్లిళ్ల సీజన్ ఎంతో కీలకం. ఒక పెళ్లితోనే లక్షల బిజినెస్ జరుగుతుంది. బట్టలు, బంగారం, ఆహార సంబంధిత, డెకరేషన్, పెళ్లి బాజా, ఫంక్షన్ హాల్స్, అర్చకులు..ఇలా ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. అందుకే పెళ్లిళ్ల సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు.
దేశ వ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్ లో దేశ వ్యాప్తంగా 42 లక్షలకు పైగా వివాహాలు జరుగనున్నట్టు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. వివాహ వేడుకల నేపథ్యంలో రూ.5.5 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలతో పాటు పెళ్లిళ్ల భోజనాలకు సంబంధించి భారీగా డిమాండ్ సృష్టిస్తుందని అంచనా.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల తేడా లేకుండా నిత్యావసర సరుకుల వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత పెళ్లిల్ల సీజన్ లో జూలై 15 వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 42 లక్షల వివాహాలు జరుగనున్నాయి.