ఒకవైపు
సుతిమెత్తని కంఠంతో
జానకీ…కత్తి అందుకో!! అంటూ
వీరరసాన్ని వెండితెరపై
రౌద్రానికి రారాజుగా
సరికొత్తగా ఆవిష్కరించినా….
మరోవైపు
గురుదక్షిణగా
కన్ను పీకేసుకొని
భక్తులను అలరించిన
భక్తకన్నప్ప….!!
ఒక వైపు
స్నేహితుల కోసం
చాచిన హస్తమై..
నిర్మాతగా మారి …
మనసున్న మారాజుగా
ఎన్నో విజయవంతమైన
చిత్రాలను నిర్మించినా….
మరోవైపు
అభినయంతో పాత్రకు
న్యాయం చేసిన
ప్రేమికుల అమర దీపం…!!
ఒకవైపు
సమస్యతో
ఏ సంబంధం లేకున్నా..
పెద్దరికంతో చొరవచూపి
ఆదర్శ రారాజుగా
పరిష్కార మార్గానికి
బాటలు వేసినా…
మరోవైపు…
నిఖార్సయిన నటనతో
యువతను ఆకట్టుకున్న
కటకటాల రుద్రయ్య….!!
ఒకవైపు
సుదీర్ఘ సినీ ప్రయాణంలో
తోటి అగ్రతారలతో
తెర పంచుకోవడంలో
ఎప్పుడూ ముందుండి…
వెండితెర త్రిశూలంగా
విలక్షణమైన నటనతో
ఇంటిల్లిపాదికీ చేరువైనా….
మరోవైపు…
సినీ జగత్తులో
పెద్దలకు అండగా నిలిచిన
బొబ్బిలి బ్రహ్మన్న…!!
ఒకవైపు
రాజకీయాల పరంగా
ఖ్యాతి అల్పమే అయినా ..
పదవి ఉన్నా లేకున్నా …
నిబద్ధత కలిగి…
భాజపా అభివృద్ధికి
అజాత శత్రువుగా కృషి చేసినా…
మరోవైపు
తరతరాల
సంప్రదాయ వైద్యంగా
ఆయుర్వేదం..
హోమియోపతిని
సైతం వాడుతూ
ప్రచారకర్తగా వ్యవహరించిన
నిరాడంబరుడు…!!
నిండైన వ్యక్తిత్వం,
గాంభీర్యమైన స్వరం..
స్ఫూర్తిదాయకమైన ప్రయాణంతో
సినీ ,రాజకీయ రంగంలో
రెబల్ స్టార్ గా
చెరగని ముద్ర వేసినా…..
“నిండైన రాజసం”తో
అభిమానుల హృదయాల్లో
ఎప్పటికీ మిగిలిపోయిన
చిరునవ్వుల “అమరదీపమే.”..!!
నలిగల రాధికారత్న.