Mega Blood Donation Camp :
ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆమె అభినందనలతో ముంచెత్తారు.
మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ భారత్ 77 ఏళ్లుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మోడీ కేవలం తొమ్మిదేళ్లలో పరిష్కరించారన్నారు. జమ్ము-కశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తివేత, రామ మందిరం, ఆర్థిక పరిపుష్టి ఇలా చాలా అంశాలను ఆయన పరిష్కరించారన్నారు. మోడీ నేడు భారత్ లీడర్ కాడని గ్లోబల్ లీడర్ అన్నారు. ఈ మాట సొంత దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు చెప్తున్నాయని పేర్కొన్నారు.
ఇక రక్తదానంపై ఆమె మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయన్నారు. డాక్టర్ జగదీష్ బాబు యలిమంచిలి రూపొందించిన ‘యూ బ్లడ్ యాప్’ గురించి ఇటీవల విన్నానని ఇది రక్తగ్రహీతలకు వరం లాంటిదన్నారు. యూ బ్లడ్ కో ఆర్డినేటర్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ చార్జి పాతూరి నాగభూషణంను ఆమె అభినందించారు. ఆ తర్వాత వారంతా ఆమెకు సన్మానం చేశారు. శిబిరంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విష్ణు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.