24.9 C
India
Friday, March 1, 2024
More

  Secret of Pitrumasika : మాసికాల రహస్యం ఇదే!

  Date:

  • మాసికాలు ఎందుకు పెట్టాలి?
  • అన్ని మాసికాలు పెట్టాలా?
  • కొన్నిమానేయవచ్చా?
  Secret of Pitrumasika
  Secret of Pitrumasika

  Secret of Pitrumasika : వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.

  అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.

  కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.

  చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

  వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

  బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.

  మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.

  దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

  మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.

  ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది.

  ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.

  ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.

  నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.

  కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.

  యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.

  ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.

  దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.

  అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.

  సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.

  దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.

  • వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.
  • దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.
  • మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).
  • నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.
  • ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.
  • ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.
  • ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.
  • ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.
  • తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.
  • పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

  ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.

  ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

  నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.

  వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

  అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.

  ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.

  కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.

  ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.

  మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.

  మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.

  తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.

  కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.

  ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.

  ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.

  ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.

  ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

  పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.

  నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.

  అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు.

  గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు…. వంటివి.

  ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.

  వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.

  వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

  ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం. ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

  ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.

  మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.

  Share post:

  More like this
  Related

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

  Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Strange Animals భారత్ లో కనిపించే వింత జీవులు ఇవే.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

  Strange Animals in India : భారత ఉపఖండం చాలా విశేషమైనది....

  Our Customs 1000years Ago : వెయ్యేళ్ల నాటి మన ఆచారాలు ఎలా ఉండేవో తెలుసా?

  Our Customs 1000years Ago : మన భారతదేశం ప్రాచీన దేశం....

  అమ్మ కావాలా ? అమెరికా కావాలా ?

  ఉన్నత చదువుల కోసం , ఉన్నతమైన ఉద్యోగాల కోసం అగ్రరాజ్యం అమెరికా...