
రాష్ర్ట ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నది. వైన్ షాపుల్లో మద్యం ఎమ్మర్పీకే విక్రయించేలా చర్యలు తీసుకోబోతున్నారు. దీంతో ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారనే గొడవలకు ముగింపు పలకనుంది. అటు మద్యం ప్రియులకు, ఇటు ప్రభుత్వానికి లాభం చేకూరనుంది. కేరళలో అమలు చేస్తున్న విధానాన్ని ఇక్కడ తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది.
రాష్ట్రంలో అధిక ధరలకు మద్యం విక్రయాలను నియంత్రించేందుకు కంప్యూటర్ బిల్లింగ్(Computer billing) విధానం అమల్లోకి రానుంది. మందుబాబులు క్యూఆర్ కోడ్, గూగుల్ పే ద్వారా నగదు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో వున్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. దాదాపు 1,967 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. దీనిని అడ్డుకునేందుకు తరచూ టాస్మాక్ అధికారులు.. తనిఖీలు చేస్తున్నా మందుబాబుల నుంచి ఎమ్మార్పీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా పొరుగు రాష్ట్రమైన కేరళ(Kerala) అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. కంప్యూటర్ బిల్లింగ్ ను తీసుకరావాని టాస్మాక్ సంస్థ నిర్ణయించింది.
రాష్ట్రంలో 5 వేలకు పైగా టాస్మాక్ మద్యం దుకాణాలు ఉన్నాయని, ఈ దుకాణాల్లో అవకతవకలు జరుగకుండా కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని టాస్మాక్ అధికారులు చెబుతున్నారు. మద్యం కొనుగోలుదారులు నగదును మొదటి కౌంటర్‌లో కంప్యూటర్(Computer) ద్వారా ఇచ్చే బిల్లును పొందవచ్చని, ఆ తరువాత రెండో కౌంటర్‌లో ఆ బిల్లును చూపించి మద్యం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో మందుబాబులకు అసలు రేటుకే మద్యం దొరకనుంది.