
Dog attack : ఉమ్మడి వరంగల్ జిల్లాలో హృదయ విధారకమైన ఘటన చోటు చేసుకుంది. వీధికుక్కలు పసివాడిని పీక్కు తిన్న ఘటన కళ్ల ముందు కదులుతూనే ఉండగా మరో ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ చిల్డ్రన్ పార్క్ సమీపంలో జరిగింది. వీధికుక్కల దాడిలో ఏడేళ్ల చోటు మృతి చెందాడు.
బిహార్ కు చెందిన సంచార జాతి కుటుంబం పొట్ట దెరువుకోసం కాజీపేటకు వచ్చారు. రైల్వే కాలనీలో ఉంటూ కూలి చేసుకుంటూ బతుకుతున్నారు. అందులోని ఒక కుటుంబానికి చెందిన బాలుడు చోటు ఆడుకుంటున్న సమయంలో రెండు కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలు కావడంతో ఆయనను హుటాహుటిన 108లో ఎంజీఎంకు తరలించారు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడిన బాలుడు చివరికి మరణించాడు.
విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నగర మేయర్ గుండు సుధారాణి, చైర్మన్ సుందర రాజ్ బాధిత కుటుంంతో మాట్లాడారు. ఘటన జరిగిన తీరును తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. వీధి కుక్కల నియంత్రణ చేపడతామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరుఫున బాధిత కుటుంబానికి రూ. లక్ష పరిహారం అందిస్తామని వరంగల్ మేయర్ ప్రకటించారు. దీంతో పాటు చిన్నారి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులతో బిహార్ పంపేందుకు అన్ని ఏర్పాటు చేస్తామని దాస్యం చెప్పారు. అప్పటి వరకూ కళ్ల ముందు తిరిగిన కొడుకు ఇక లేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం ఉండేందుకు స్థలం కూడా లేని ఆ కుటుంబం రోడ్డు పక్కన చెట్టుకింద కూర్చొని విలపించే సన్నివేశం చూపరులను కన్నీరు పెట్టిస్తుంది.