Mohan Babu : మోహన్ బాబు సినీ నటుడే కాదు ఎన్టీఆర్ బతికున్నప్పుడు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తర్వాత అడపాదడపా ఆయన పేరు రాజకీయాల్లో వినపడుతున్నా ఆయన సినిమాలకే పరిమితం అయ్యారు. ఆ తర్వాత సినిమాలను కూడా బాగా తగ్గించారు. తాజాగా తనపేరును రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆయన పేరును ఎవరు వాడుకుంటున్నారు? అంత అవసరం ఎవరికొచ్చిందని జనాలు చర్చించుకుంటున్నారు. తన పేరును అనవసరంగా వాడుకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మోహన్ బాబు ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇంతకీ అందులో ఏముందంటే..
ఈ మధ్యకాలంలో తన పేరుని రాజకీయంగా కొందరు వాడుకుంటున్నారని తన దృష్టికి వచ్చినట్టు చెప్పారు. దయచేసి ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం.. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతమని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలి గానీ.. సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధకరమన్నారు. తనకు అండదండగా ఉన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మీ మోహన్ బాబు అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే మోహన్ బాబు పేరును ఎవరు వాడుకున్నారనేది ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన పేరును వాడుకుని రాజకీయాలు చేసేంత అవసరం ఎవరికుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగనున్న టైంలో మోహన్ బాబు ప్రకటన చర్చనీయాంశమైంది.