IT Employees Car Rally :
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అభియోగాలతో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఏపీ, తెలంగాణతో పాటు దేశ, విదేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ శ్రేణులతో పాటు ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఐయామ్ విత్ సీబీఎన్ అనే నినాదంతో హైదారాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో తెలుగు వారితో పాటు టెకీలు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు.
హైదరాబాదులోని ఓఆర్ఆర్ పై టెకీలు కార్ల ర్యాలీ నిర్వహించగా, పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాజాగా ఆదివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి కి ఐటీ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ ప్రకటించారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ర్యాలీ తీయనున్నట్లు ఐటీ ఉద్యోగులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీ సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని, ఒకవేళ ర్యాలీ తీస్తే కేసులు నమోదు చేస్తామని ఏపీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సరిహద్దులో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఐటీ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొంటే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వాహనాల యాజమాన్యాలపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మూడు అంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి నిరసనలు, ధర్నాలు ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు చంద్రబాబు నాయుడిని పరామర్శించేందుకు వస్తున్న సమాచారంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు.పోలీస్ పికెట్ విధానాన్ని విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.