![KTR-Harish Rao](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/Will-KTR-and-Harish-Rao-do-padayatras.webp)
KTR-Harish Rao : కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ ‘నీటి పోరు యాత్ర’ చేపట్టాలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. కాళేశ్వరం, నాగార్జునసాగర్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణలో నీటి పారుదల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన బీఆర్ఎస్ పార్టీల మధ్య రగడ రాసుకుంది. అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరం నుంచి కేటీఆర్, నల్లగొండ నుంచి హరీష్ పాదయాత్ర చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నల్లగొండ సభ సక్సెస్ తో జోష్ మీదున్న బీఆర్ఎస్.. ఇదే ఊపుతో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పెట్టిన మొదట సభ నల్లగొండ. దీన్ని సక్సెస్ చేయడంలో నాయకులు, కార్యకర్తలు సఫలీకృతం అయ్యారు. సభలో బాస్ కేసీఆర్ స్పీచ్ ప్రజల్లోకి వెళ్లింది. 2023 ఎన్నికల్లో తన వాయిస్ ను తగ్గించిన కేసీఆర్ ఈ సభతో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు, ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నల్లగొండ సభ సక్సెస్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ లో కూడా సభ పెట్టాలని పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి.
సార్వత్రిక షెడ్యూల్ మార్చి 2వ వారంలో రానుంది. ఈ లోపే భారీ బహిరంగ సభను నిర్వహించి సక్సెస్ చేయాలని అధినేత ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు హైదరాబాద్ సభను మలచాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కృష్ణా జలాల అంశంపై లోతుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2 రాష్ట్రాలకు 50-50 నిష్పత్తిలో నీటి పంపకం విషయం అపెక్స్ కౌన్సిల్ తేల్చాలని కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయించినా, అపెక్స్ కౌన్సిల్ సమావేశమే జరగలేదని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బీఆర్ఎస్ గెలుపునకు దోహద పడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని ప్రజలకు చెప్పనున్నట్లుగా తెలుస్తోంది.