Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు వినియోగం మరింత ఎక్కువ. దీన్ని తీపి, కారం ఇలా చాలా రకాల వంటకాలలో వినియోగిస్తారు. పైగా సాంబార్ లాంటి ద్రవ వంటకాల్లో కూడా దీని వినియోగం ఎక్కువగానే ఉంటుంది. ఇన్ని అవసరాలు తీర్చే పప్పును ప్రభుత్వం కూడా రేషన్ దుకాణాల్లో సబ్సిడీ కింద, లేదంటే ఫ్రీగా అందజేస్తుంది. సాంబారు, దప్పడం, కూరగా వండి చపాతీలు, పూరీల్లో పప్పుతో తింటే ఆ టేస్టే వేరని చెప్పవచ్చు. ఇక ఆవకాయలో కొంచెం ముద్దపప్పుగా కలుపుకుంటే కడుపు వద్దంటున్నా.. నాలుకా కావాలనాల్సిందే. ఇన్ని రెసిపీల కోసం వాడే కంది పప్పుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండగా.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు.
కంది పప్పులో ప్రొటీన్, డైటరీ ఫైబర్ కావాల్సినంత ఉంటుంది. కొలెస్ట్రాల్, శాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. దీంతో సులభంగా జీర్ణం అవుతుంది. ఇక కంది పప్పు ఎక్కువగా తింటే అజీర్తి, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. ఇది కొందరికి అస్సలు పడదు. కొన్ని దుష్ప్రభావాలను పరిశీలిస్తే..
డైజెస్టివ్ అలర్జీలు..
కంది పప్పు రాత్రి తింటే.. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా గ్యాస్, ఎసిడిటీతో పాటు అజీర్తి సమస్యలు రావచ్చు. పగలు మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉదయం సమయంలోనే డైజెస్టివ్ సిస్టమ్ చురుకుగా ఉంటుంది, పోషకాలు శరీరానికి పడతాయి. కొత్తగా పప్పు తినడం అలవాటు చేసుకునే వారు, చిన్న మొత్తంలో తింటూ వినియోగాన్ని పెంచడం మంచిది.
యూరిక్ యాసిడ్
పప్పులు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచవు. కానీ, కిడ్నీ సమస్యలున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పప్పులో ఉండే సమ్మేళనం ప్యూరిన్లు పడని వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పప్పు తింటే వీరిలో మెటబాలైజ్డ్ యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు మూత్రపిండాల్లో రాళ్లుగా మారే అవకాశం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వ్యర్థాల తొలగింపును కూడా అడ్డుకోగలవు. దీని వల్ల అంటు వ్యాధులు, కిడ్నీ ఫెయిల్ ప్రమాదం ఉంది.
హైపర్ కలేమియా
పప్పులో పొటాషియం ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఉంటే హైపర్‌కలేమియా ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ప్లాస్మా పొటాషియం స్థాయిలను పెంచుతుంది. 5.0 mEq/L నుంచి 5.5 mEq/L కంటే ఎక్కువగా ఉంటే సమస్యలు రావచ్చు. హైపర్ కలేమియా లక్షణాలైన వాంతులు, అలసట, హృదయ స్పందనలో వ్యత్యాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవ్వచ్చు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ లక్షణాలు మరింత ఇబ్బంది పెడతాయి.
పైల్స్, మొలలతో బాధపడేవారు కంది పప్పు తింటే, పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అధిక ప్రొటీన్ ఉండే కందిపప్పును అరిగించుకోవాలంటే శక్తివంతమైన జీర్ణశక్తి అవసరం. డైజేషన్ ఇబ్బంది లేకపోతే మలబద్ధకం తీవ్రం అవుతుంది, పైల్స్ లక్షణాలు ఎక్కువవుతాయి.