
సీబీఐ మాజీ డైరెక్టర్ , మాజీ మంత్రి కాకులమర్రి విజయ రామారావు (85) మార్చి 13 న మరణించారు. గతకొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న విజయరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసారు. విజయరామారావు తనయుడు అమెరికాలో ఉండటంతో అతడు వచ్చాక రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం స్వగ్రామం.
వరంగల్ జిల్లా మారుమూల ప్రాంతమైన ఏటూరు నాగారం నుండి దేశ అత్యున్నత స్థాయి పదవి అయిన సీబీఐ డైరెక్టర్ వరకు ఎదిగారు. హైదరాబాద్ మహానగరం పోలీస్ కమీషనర్ గా కూడా సేవలు అందించారు. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో 1999 లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి పి. జనార్దన్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. ఆ విజయంతో తన మంత్రివర్గంలో కీలక మంత్రిగా నియమించారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత రెండుసార్లు పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు విజయరామారావు.