సాధారణంగా ఒక ఇంట్లో అయినా , లేదా మరో చోట అయినా సరే ఒక మనిషికి మరో మనిషి అవసరం తప్పకుండా ఉంటుంది. సాటి మనిషి అవసరం లేకుండా ఒక్క క్షణం కూడా అడుగు ముందుకు వేయలేము. కానీ ఇది ఒకప్పటి మాట……. ఈ ఆధునిక యుగంలో సాటి మనిషి అవసరం లేకుండానే ….. సహాయం లేకుండానే హాయిగా జీవించవచ్చు అని చెబుతోంది ఓ అధునాతనమైన ఇల్లు.
కరెంట్ అవసరం లేకుండా, కరెంట్ బిల్లు కట్టకుండా మొత్తం సోలార్ వ్యవస్థ తో అన్ని హంగులతో రాబోయే తరానికి ఒక కొత్త ఇల్లు రూపొందింది. సమస్తం ఈ ఇంటిలోనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు సుమా ! ఇంటి లోపలకు వెళ్ళగానే మనం వెలుతురు కోసం లైట్లు వేస్తాం…… కానీ ఇక్కడ ఆ అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆటోమేటిక్ గా లైట్లు , ఫ్యాన్లు ఆన్ అవుతాయి. అలాగే బాల్కనీని అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు , తగ్గించుకోవచ్చు. ఓపెన్ బాల్కనీ ఉంటుంది…… వర్షం కనుక వస్తుంటే ఆ టాప్ మూసుకుపోతుంది. దాంతో వర్షపు నీరు లోపలకు రాకుండా అడ్డుకుంటుంది.
అలాగే ఎలక్ట్రిక్ కారును మనం ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు….. లోపల పెట్టగానే ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతుంది. అంతేకాదు ప్రతీ రోజూ దానికదే కారు వాష్ చేస్తుంది. ఇంటి బయటి గోడలు ఆడుకోవడానికి అణువుగా క్రీడా ప్రాంగణంలా మారుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. ఇంతటి అధునాతనమైన ఇల్లు మానవ విజ్ఞానంతో రూపొందించబడుతోంది. ఇది మానవాళి మేథాశక్తికి తార్కాణం అనే చెప్పాలి.