
తెలుగుతెరపై సత్యభామగా చిరస్థాయిగా నిలిచిన సమ్మోహన శక్తి , డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ జమున. సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన ధీశాలి జమున. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఉద్దండులు అయిన ఎన్టీఆర్ , అక్కినేని లాంటి మహానటులతో ఒక దశలో తీవ్ర విబేధాలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ , అక్కినేని స్టార్ హీరోలు అయితే వాళ్ళు ఎంతటి స్టార్స్ అయినా సరే నేను తలవంచేది లేదంటూ తన ఆత్మగౌరవాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తి జమున.
అయితే అదే ఎన్టీఆర్ , అక్కినేని లతో పలు సూపర్ హిట్ చిత్రాలను చేసింది. అగ్ర హీరోలతో వచ్చిన అరమరికలను దిగ్విజయంగా తొలగిపోయేలా చేసి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న మహానటి జమున అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ , అక్కినేని లను ఎంతో గౌరవించింది ……. అలాగే దిక్కరించాల్సిన సమయంలో దిక్కరించింది…….. మళ్ళీ కలిసి పోయింది. తన వ్యక్తిత్వాన్ని చాటుకుంది.
1936 ఆగష్టు 30 న హంపీలో జన్మించింది. జమున అసలు పేరు జనాభాయి అయితే జ్యోతిష్యుల సలహాతో జమునగా మార్చారు. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ చిత్రాల్లో నటించింది. మొత్తంగా కెరీర్ లో అన్ని భాషల్లో కలిపి 200 కు పైగా చిత్రాల్లో నటించింది. నిజంగా సౌందర్యరాశి అంటే జమున అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన వ్యక్తిత్వం వల్లే సత్యభామ పాత్రకు ప్రాణం పోసింది……. తెలుగుతెరపై సత్యభామగా నిలిచింది. సత్యభామ పాత్రలో ఇప్పటికి కూడా మరొకరిని ఊహించుకోలేము అని అంటే అతిశయోక్తి కాదు సుమా !
సినిమారంగంలో తనదైన ముద్ర వేసిన జమున రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచింది. 1989 లో లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించింది. అయితే రెండేళ్లకే లోక్ సభకు మళ్ళీ ఎన్నికలు రావడంతో నిరుత్సాహపడింది. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కొంతకాలం పనిచేసింది. అనంతరం రాజకీయలకు స్వస్తి పలికింది.