
సీనియర్ నటి జమున అంత్యక్రియలు నిర్వహించనుంది ఆమె కూతురు స్రవంతి. జమున ఈరోజు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. నటిగా , రాజకీయ నాయకురాలిగా చెరగని ముద్ర వేసింది. ఇక 60 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఎన్టీఆర్ , అక్కినేని లాంటి మహానటుల సరసన పలు చిత్రాల్లో నటించింది.
ఒక దశలో జమునను ఎన్టీఆర్ , అక్కినేని ఇద్దరు కూడా బ్యాన్ చేసారు. తమ చిత్రాల్లో పెట్టుకోకుండా జమునను ఇబ్బంది పెట్టారు. అయితే ఆత్మగౌరవం కాస్త ఎక్కువగా ఉన్న జమున ఆ ఇద్దరు సీనియర్ హీరోలకు తలవంచలేదు ……. సారీ చెప్పలేదు. మూడేళ్ళ పాటు ఎన్టీఆర్ , అక్కినేని సరసన నటించే అవకాశం కోల్పోయినా లెక్కచేయలేదు. అయితే పరిశ్రమ పెద్దలు రాజీమార్గం కుదర్చడంతో అటు ఎన్టీఆర్ , అక్కినేని ఇటు జమున రాజీకి ఒప్పుకున్నారు దాంతో మళ్ళీ ఎన్టీఆర్ , అక్కినేని సరసన నటించింది జమున.
ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ , అక్కినేని లతో ఎలాంటి విబేధాలు తలెత్తలేదు జమునకు. ఆత్మాభిమానం మెండుగా ఉన్న నటి అందుకే ఎంతటి పెద్దవాళ్ళ నైనా సరే ధిక్కరించి మాట్లాడే స్వభావం కల వ్యక్తిగా నిలిచింది. సత్యభామ కున్న అన్ని అంశాలను పుణికిపుచ్చుకున్న మహానటి , సొగసరి జమున అనడంలో ఎలాంటి సందేహం లేదు. జమున అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఈరోజు సాయంత్రం జరుగగా…….. తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది కూతురు స్రవంతి. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లి అంత్యక్రియలు కొడుకు చేస్తాడు …… అయితే తన కూతురు స్రవంతి అంటే జమునకు ఎనలేని ప్రేమ దాంతో ఆమెనే అంత్యక్రియలు నిర్వహించింది.