
కృష్ణమ్మ నదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్తికల నిమజ్జనం జరిగింది. ఈనెల 15 న సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. దాంతో కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్ళ అస్తికలను పవిత్ర నదీ జలాలలో కలపడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.
ఆ సంప్రదాయం ప్రకారం తండ్రి కృష్ణ అస్తికలను తీసుకొని విజయవాడలోని కృష్ణా నదికి చేరుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణమ్మ నదిలో కృష్ణ అస్తికలను నిమజ్జనం చేసాడు. మహేష్ బాబు వెంట బాబాయ్ ఆది శేషగిరిరావు, బావ గల్లా జయదేవ్ ( గుంటూరు ఎంపీ ), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ లతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. కృష్ణ అస్తికలను కృష్ణమ్మ నదిలో నిమజ్జనం చేయడానికి మహేష్ బాబు వచ్చాడన్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
దాంతో అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. అభిమానులతో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా మహేష్ బాబును కలిశారు. ఇక ప్రముఖ ప్రవాసాంధ్రులు , సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని, UBlood app ఫౌండర్ జై యలమంచిలి , బీజేపీ ఏపీ కార్యదర్శి , UBlood డైరెక్టర్ పాతురి నాగభూషణం మహేష్ ను కలిసి కృష్ణ తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.