టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రంలో రైతుగా నటించిన గురుస్వామి (80) శుక్రవారం సాయంత్రం మరణించారు. 15 రోజుల క్రితం గురుస్వామికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్ తరలించి వైద్యం చేయించారు. ఆ తర్వాత కర్నూల్ బాలాజీనగర్ లోని స్వగృహానికి వచ్చారు. ఇక ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
అయితే శుక్రవారం రోజున పరిస్థితి విషమించడంతో సాయంత్రం మరణించారు. గురుస్వామి బిఎస్ ఎన్ ఎల్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద మక్కువతో పలు ప్రయత్నాలు చేయగా మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో కథను కీలక మలుపు తిప్పే రైతు పాత్ర గురుస్వామిని వరించింది. దాంతో అతడికి మంచి పేరు వచ్చింది.
ఆ సినిమా తర్వాత ఉప్పెన , భీష్మ , వకీల్ సాబ్ , రిపబ్లిక్ , చలో ప్రేమిద్దాం , రంగస్వామి తదితర చిత్రాల్లో నటించారు. గురుస్వామి మరణం పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.