
నటీనటులు : చిరంజీవి , రవితేజ , శృతి హాసన్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
దర్శకత్వం: బాబీ
రిలీజ్ డేట్ : 13 జనవరి 2023
రేటింగ్ : 3/5
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి బరిలో దిగిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ :
వీరయ్య ( చిరంజీవి ) వాల్తేరు లో ఓ పోర్ట్ లో ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో ఆణువణువూ తెలిసిన వీరయ్య ను ఓ ఆపరేషన్ నిమిత్తం మలేషియాకు పంపిస్తాడు పోలీస్ అధికారి సీతాపతి ( రాజేంద్ర ప్రసాద్ ) . మలేషియా వెళ్లిన వీరయ్యకు అక్కడ అదితి ( శృతి హాసన్ ) పరిచయం అవుతుంది. వాల్తేరు వీరయ్యకు మలేసియాలో ఏం పని ? అలాగే ఏసీపీ విక్రమ్ సాగర్ ( రవితేజ ) కు వీరయ్యకు ఉన్న అనుబంధం ఏంటి ? మలేషియా ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలెట్స్ :
మెగాస్టార్ చిరంజీవి
రవితేజ
ఎంటర్ టైన్ మెంట్
యాక్షన్ సీన్స్
డ్రా బ్యాక్స్ :
రొటీన్ కథ
నటీనటుల ప్రతిభ :
వీరయ్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి పాత్రలు చిరంజీవికి కొట్టిన పిండి . పక్కా మాస్ మసాలా పాత్రలో అదరగొట్టాడు చిరు. ఇక రవితేజ – చిరంజీవి ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవి లుక్స్ చాలా బాగున్నాయి. ఏజ్ బాగా తగ్గినట్లుగా కనిపించాడు ……. దాంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శృతి హాసన్ అందంగా ఉంది ……… అందాలను ఆరబోసింది కానీ ఈ భామకు అంతగా ప్రాధాన్యత లేకుండాపోయింది. ఇక రవితేజ ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ ఏసీపీ పాత్రలో అదరగొట్టాడు. చిరంజీవి డైలాగ్ ను రవితేజ చెప్పడం , రవితేజ డైలాగ్ ను చిరంజీవి చెప్పడం థియేటర్ లో ఈలలు వేయించింది. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల్లో రాణించారు.
సాంకేతిక వర్గం :
విల్సన్ ఛాయాగ్రహణం ఈ చిత్రాన్ని అద్భుతమైన సుందర కావ్యంగా తీర్చి దిద్దింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. అలాగే 3 పాటలు బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక బాబీ విషయానికి వస్తే …… పెద్దగా కథ , కథనం లేకపోయినా ఎంటర్ టైన్ మెంట్ , యాక్షన్ , సాంగ్స్ ఇవన్నీ సమపాళ్లలో సమకూర్చి భేష్ అనిపించాడు. బాస్ ను ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో అదే పంథా కొనసాగించాడు.
ఓవరాల్ గా :
పక్కా కమర్షియల్ ……. వాల్తేరు వీరయ్య