- డీకేను ఒప్పించాకే నేడు ప్రకటన
- ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేపీసీసీ చీఫ్?

Sidda Ramaiah finalized : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తున్నది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పై కూడా మంచి అభిప్రాయం ఉన్నా ప్రస్తుతం ఆయన పై సీబీఐ, ఈడీ కేసుల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే ఆయనకు మరింతగా గౌరవించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లుగా సమాచారం. డీకే ను సీఎంగా ఎంపిక చేస్తే బీజేపీ మరింత ఇబ్బందులు సృష్టించే అవకాశమున్నదని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే డీకేకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇయ్యాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే కేవలం ఒక్కరే డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండాలని, లేకుంటే తనకు ప్రాధాన్యం ఉండదని డీకే భావిస్తే నిర్ణయం మరోలా ఉండవచ్చు..
ఏఐసీసీ చీఫ్ తీవ్ర కసరత్తు..
కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే మూడు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఆయన తెప్పించుకున్నారు. సోనియా, రాహుల్ తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రానికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉందనే అంతా భావిస్తున్నారు. అదే రాష్ర్టానికి చెందిన మల్లికార్జున ఖార్గే ఇద్దరు నేతలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు.
ఢిల్లీకి డీకే..
పార్టీ హైకమాండ్ పిలిచినా సోమవారం ఢిల్లీ వెళ్లని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. కర్ణాటక గెలుపులో డీకే శ్రమను అధిష్ఠానం మరిచి పోదని, ఆయనే వారికి కీలకమని పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. ఆయనను ఒప్పించాకే నిర్ణయం వెల్లడించాలని అధిష్ఠానం వేచి చూస్తున్న తరుణంలో ఇప్పుడు కన్నడిగుల చూపు ఢిల్లీ వైపు మారింది. 2024 లోకసభ ఎన్నికల నేపథ్యంలో డీకే సేవలు కర్ణాటకలో కచ్చితంగా అవసరమని అధిష్ఠానం భావిస్తున్న నేపథ్యంలో ఇక ఢిల్లీ కేంద్రంగా మంగళవారం ఎలాంటి ప్రకట వస్తుందో వేచి చూడాలి.