ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన తెలంగాణ స్టూడెంట్ అఖిల్ సాయి మృత్యువాత పడ్డాడు. గత ఏడాది కిందట ఎమ్మెస్ చేయడానికి వెళ్ళాడు. అఖిల్ సాయి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మధిర కు చెందిన వ్యక్తి. అఖిల్ సాయి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్తానంటే కొడుకు మరింత ప్రయోజకుడు అవుతాడు కదా అని పంపించారు.
అయితే ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడట అఖిల్ సాయి. కాగా ఆ గ్యాస్ స్టేషన్ లో సెక్యూరిటీ గార్డ్ దగ్గరున్న గన్ ను చూస్తుండగా అది మిస్ ఫైర్ అయినట్లు మొదట సమాచారం ఇచ్చారట పేరెంట్స్ కు. అఖిల్ సాయి తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించాడు.
దాంతో అఖిల్ సాయి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. వాళ్ళను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకొని సరైన రీతిలో దర్యాప్తు చేసి అఖిల్ సాయి మృతికి కారణాలు తెలుసుకోవాలని , దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అఖిల్ సాయి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.