- బెంగళూరులో తేలని పంచాయతీ
- ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ రాజకీయం
- నేడు అధిష్ఠానమే ప్రకటించే అవకాశం

CM of Karnataka : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అందరి అంచనాలను మించి ఏకంగా 136 సీట్లను గెల్చుకోవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. అయితే ఇంకా సీఎం ఎవరనేది (CM of Karnataka) మాత్రం తేలలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఇంకా ఆ పోటీ కొనసాగుతున్నది. అయితే అధిష్టానం వద్దకు ఈ పంచాయతీ చేరినట్లు సమాచారం.
అరగంటలో ముగిసిన సీఎల్పీ..
సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన సీఎల్పీ భేటీ సగంలోనే ముగిసింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గీయుల పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. అయితే పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సమాచారం. దీంతో సీఎం సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. సోమవారం రాహుల్, సోనియా దీనిపై ఓ నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాహుల్, సోనియాను కలిసి చర్చించనట్లు సమాచారం. సోమవారం ఢిల్లీకి రావాలని సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ లకు ఆహ్వానం అందినట్లుగా తెలుస్తున్నది. ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీపడుతున్నారని తెలిసింది.
అయితే సీఎల్పీ మాత్రం హైకమాండ్ కే సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని ఏకవాఖ్య తీర్మానం చేసినట్లుగా సమాచారం. అయితే ఇక సోమవారం హై కమాండ్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం ఏఐసీసీ స్వీకరించింది. ఇక అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాలి. మరోవైపు కాంగ్రెస్ లో పరిణామాలను బీజేపీ నిశీతంగా పరిశీలిస్తున్నది. ఈ వివాదాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం.