
Karnataka new government : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదారు రోజుల చర్చల తర్వాత అధిష్టానం సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ పేర్లను ప్రకటించింది. పీసీసీ చీఫ్ గా కూడా డీకేనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఏఐసీసీ చీఫ్, సోనియా, రాహుల్ ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే కర్ణాటకలో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొత్త క్యాబినెట్ లో ఎవరిని తీసుకోవాలనే అంశంపై సిద్ధరామయ్య, డీకే విస్తృత చర్చలు జరిపారు. ఢిల్లీకి శుక్రవారం వెళ్లిన వీరు ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, రాహుల్ వాద్రాలను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. క్యాబినెట్ లో కి 20 మంది మంత్రులను తీసుకోనున్నారు. వివిధ ప్రాంతాలు, రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని క్యాబినెట్ కూర్పు జరిగినట్లు తెలుస్తున్నది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే కుమారుడు ప్రియాంక ఖర్గే ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈయనతో పాటు జీ పరమేశ్వర, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్, సతీశ్ జే, ఎంబీ పాటిల్, మనయప్ప, తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
