Balayya Challenge : ఏపీ అసెంబ్లీ లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందయూరి బాలకృష్ణ విశ్వరూపం చూపుతున్నారు. తమ పార్టీ అధినేత, బావ చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నిర్వహిస్తున్న పోరాటానికి ఆయన నాయకత్వం వహిస్తు్న్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అయితే బాలకృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం మాత్రం తమకు అనుకూల వీడియోలను కట్ చేసి విడుదల చేస్తున్నదని, అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరును మాత్రం దాచి పెడుతున్నదనే అభిప్రాయం విపక్షాల నుంచి వినిపిస్తున్నది. అసెంబ్లీలో బాలకృష్ణ ఎంతో హుందాగా వ్యవహరించారని, కానీ కేవలం రెండు క్లిప్పులను విడుదల చేసి, ఆయన వ్యక్తిత్వంపై దాడికి దిగే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో సంయమనంతో వ్యవహరించారు. మంత్రి అంబటి పదేపదే రెచ్చగొడుతున్నా ఆయన పరిధి దాటలేదు. ఇక దమ్ముంటే రా.. అంటూ అంబటి రెచ్చగొడుతున్నా, బాలకృష్ణ కొంత సంయమనం చూపించారు. చూసుకుందామంటూ సవాల్ విసిరారు. గతంలో వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే తొడ గొట్టిన విషయాన్ని మరిచి, కేవలం బాలకృష్ణ మీసం తిప్పిన అంశాన్ని వైసీపీ వివాదం చేసింది. అసెంబ్లీలో టీడీపీ శాంతియుత పోరును వివాదాస్పదం చేస్తూ, ఆద్యంతం రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఇక తమ వ్యూహంలో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ వెళ్తున్నది. చంద్రబాబు పై చర్చ సమయానికి మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో లేకుండా చేయాలనేది ప్రణాళికలో భాగంగా వారు ముందుకెళ్తున్నారు.
ఇక శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమావేశంలో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ ఊదుతూ తన నిరసన తెలిపారు. మరోవైపు ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు మార్షల్స్ ను పెద్ద సంఖ్యలో మోహరించింది. అధికారంలో ఉన్నాం కదా.. అని వైసీపీ తమపై దాడులకు దిగుతున్నదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.