Bonala jatara in London : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్(టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. లండన్ లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 1200లకు పైగా ప్రవాసీ కుటుంబాలు హాజరయ్యాయి. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల.. ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా సంయుక్త కార్యదర్శి గొట్టిముక్కల సతీష్ రెడ్డి వ్యవహరించారు.
బోనాల జాతర వేడుకల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. లండన్ వీధుల్లో తొట్టెలను ఊరేగింపు.. పోతురాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్ మల్చేలం.. వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషధారణతో అలరించాడు.
యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో క్రియాశీలకంగా పాల్గొంటారని హౌంస్లౌ మేయర్ కొనియాడారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు. ఈకార్యక్రమంలో టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల..ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డిలు మాట్లాడుతూ యూకేలో భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు.
ఎన్నారై బీఆర్‌యస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ దూసరి మాట్లాడుతూ లండన్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. సీఎంకేసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు కోరుకుంటున్నారని తెలిపారు. కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ ఇటీవల సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించి, తెలంగాణ ప్రగతిని దేశానికి తెలిసేలా చేశారన్నారు.
ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత.. రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా సంప్రదాయ తెలంగాణ వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించారు. టాక్ ముఖ్య నాయకులు జాహ్నవి.. హరి గౌడ్ నవపేట్.. సత్య చిలుముల.. రాకేష్ పటేల్.. సత్యపాల్ పింగిళి.. శ్రీకాంత్.. క్రాంతి తదితరులు ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు పాల్గొన్నారు.