Kartika Vanabhojanas : ఎక్కడో మాతృభూమికి దూరంగా ఎడారిలో అందునా నడి అరబ్బు నేలపై మక్కా, మదీన పుణ్యక్షేత్రాల మధ్య ఎర్ర సముద్ర తీరాన తెలుగు పలుకు వింటే చాలు.. అనే నైరాశ్య పరిస్థితులలో నుండి ఒక్కసారిగా తెలుగుతనం ఉట్టిపడిన సందర్భం అది.. ఒకప్పుడు నక్సలైట్ల విప్లవ పోరాటలతో అట్టుడికిపోయిన అటవీ ప్రాంత గిరిజనుల నుండి మొదలు నేటి హైటెక్ సిటీ సంపన్నవర్గాలకు చెందిన వారి వరకు, అటు వేగావతి నదీ తీరాన విజయనగరం జిల్లా బొబ్బిలి నుండి ఇటు తుంగభద్ర నదీ తీరాన ఉన్న కర్ణాటక సరిహద్దు కర్నూలు జిల్లా వరకూ వివిధ జిల్లాల తెలుగు ప్రవాసీయులు ఆత్మీయంగా కలుసుకొన్న సన్నివేశం.
శుక్రవారం రాత్రి సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనం మరియు శివమంగళ హారతుల కార్యక్రమం సందర్భంగా తెలుగు ప్రవాసీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రవాసీయులు ఇందులో పాల్గొనగా అందులో కొందరు ముస్లింలు కూడా కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొన్నారు.
వచ్చే నెలలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కూడా జెద్ధా నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సాటా అధ్యక్షులు మల్లేశన్ ఈ సందర్భంగా వెల్లడించారు.