
Bandi Sanjay Comments : కర్ణాటకలో హస్తం పార్టీ ఘన విజయం సాధించింది. కనీసం హంగ్ కు కూడా ఆస్కారం ఇవ్వలేదు. మేజిక్ ఫిగర్ ను దాడి అదనంగా 23 సీట్లను సాధించింది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా మే 10న పోలింగ్, మే 13న లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించింది. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా నేతలు స్పందించారు.
కర్ణాటక గెలుపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఒక్క రాష్ట్రంలో విజయం సాధిస్తేనే అంతలా బీరాలకు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. హిందూ వ్యతిరేక శక్తులు అన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాయని ఆరోపించారు. ఒక్క స్టేట్ గెలిచినంత మాత్రాన వీర్రవీగడం సరికాదన్నారు. కర్ణాటకలో గతంలో బీజేపీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ వస్తుందన్నారు. ఇది అక్కడి ఓటర్ల తీర్పని ముందే తెలుసు అన్నారు. అయితే గతలో కంటే మా పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేత కేసీఆర్ కర్ణాటకలో చక్రం తిప్పడంతో బీజేపీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని అక్కడ బీజేపీని ఓడించేందుకు కుమారస్వామితో కలిసి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయాలు తెలంగాణలో సాగవని అన్నారు. తెలంగాణ రాజకీయాలు, కర్ణాటక రాజకీయాలు ఒక్కటి కావన్నారు. అక్కడి ప్రజలు ప్రతీ ఐదేళ్లకు ప్రభుత్వం మారుస్తారు. ఈ సారి కూడా అలాగే జరగవచ్చు గాక. కానీ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీజేపీ రావడం ఖాయమని, డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణ భవిష్యత్ ను మారుస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు.