సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రూబీ లాడ్జీ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దారుణ సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
సంఘటనా వివరాలలోకి వెళితే ……. సికింద్రాబాద్ లో రూబీ లాడ్జీ నిర్వహిస్తున్నాడు రంజిత్ సింగ్ బగ్గా. ఇదే లాడ్జీ సెల్లార్ లో నిబంధనలకు విరుద్దంగా ఎలక్ట్రిక్ బైక్ షోరూం నిర్వహిస్తున్నాడు. అయితే అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో చెలరేగిన మంటలతో పొగ దట్టంగా అలుముకుంది. దాంతో పైన లాడ్జీలో ఉన్న 25 మంది వరకు ఊపిరాడక కొంతమంది అందులోనే చనిపోయారు. మరికొంతమందికి మంటలు అంటుకున్నాయి. ఇక మిగతా మంది ప్రాణాలు దక్కించుకోవడానికి కిందకు దూకారు. అలా దూకిన వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
లాడ్జీ ప్రమాదంలో మరణించిన సంఘటన ప్రధాని నరేంద్ర మోడీని కలవరపరిచింది. మృతులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేసిన ప్రధాని రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.