దసరా కానుకగా అక్టోబర్ 5 న మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజునే భారీ వసూళ్లు సాధించడం ఖాయమని అనుకుంటే కేవలం 38 కోట్లు మాత్రమే వసూల్ అయ్యింది. ఆ తర్వాత రోజు 31 కోట్లు వసూల్ చేసింది. ఇక మూడో రోజు నాలుగో రోజు కూడా వసూళ్లు తగ్గాయి. దాంతో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు దాదాపుగా 50 కోట్ల షేర్ వసూల్ అయ్యింది.
అయితే గాడ్ ఫాదర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్లకు అమ్మారు. అంటే ఈ సినిమాను కొన్న బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే 92 కోట్ల షేర్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే 92 కోట్ల షేర్ వస్తుందా ? అనే చిన్న అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే మొదటి వారంలోనే ఎంత ఎక్కువ రాబడితే అంత మంచిది.
మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం. నయనతార, సత్యదేవ్, సునీల్ , సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో నటించారు.