ఆర్ ఆర్ ఆర్ చిత్రం జపాన్ లో దిగ్విజయంగా 100 రోజులను పూర్తి చేసుకుంది. జపాన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రమే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడెప్పుడో ముత్తు చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ సినిమా జపాన్ లో 27 ఏళ్ల క్రితమే 18 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ రికార్డ్ ను ఆర్ ఆర్ ఆర్ బద్దలు కొట్టింది.
ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా జపాన్ లో అత్యధిక కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితం కాలేదు. ఆ రికార్డ్ ఆర్ ఆర్ ఆర్ సొంతం చేసుకుంది. 42 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక షిఫ్ట్ లతో 114 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది ఆర్ ఆర్ ఆర్.
ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ , శ్రియా శరన్ , అలియా భట్ , సముద్రఖని తదితరులు నటించిన విషయం తెల్సిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది.