
Pakistan request : ముందు చూస్తే నువ్వు వెనుక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరిస్థితి. ఆసియా కప్ 2023 పాకిస్తాన్ లో జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ క్రికెట్ టీం రాదని బీసీసీఐ తేల్చి చెప్పింది. భారత్ రాకుంటే తాము రామంటూ శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా చెప్తున్నాయి. దీంతో ఆసియా కప్ నిర్వహణ దేశాన్ని మార్చాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. అయితే ఆసియా కప్ కు భారత్ రాకుంటే భారత్ లో నిర్వహించే వరల్డ్ కప్ కు తాము కూడా రామని పాకిస్తాన్ బెదిరిస్తోంది.
పీసీబీ బెదిరింపులకు తాము తలొగ్గే పరిస్థితి లేదని బీసీసీఐ తేల్చి చెప్తుంది. అయితే ఇప్పటి వరకూ పాకిస్తాన్ వరల్డ్ కప్ లో ఆడుతుందా? అనే దానిపై పీసీబీ క్లారిటీ ఇవ్వలేదు. ఆసియా కప్ కు భారత్ రాకుంటే.. వరల్డ్ కప్ కు తాముకూడా రామని పాక్ క్రికెట్ బోర్డు చెప్తుంది. పాక్ ఎంత బెదిరించినా తాము బెదరమని బీసీసీఐ చెప్తుంది. పాక్ లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బీసీసీఐ ఆసియా కప్ వేదిక మార్చాలని కోరుతుంది.
అయితే ఇందులో పాకిస్తాన్ కు మరో తలనొప్పి కూడా ఉంది. వరల్డ్ కప్ ఆడకుంటే నష్ట పరిహారంగా రూ. 200 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఐసీసీ ఇప్పటికే పాకిస్తాన్ ను హెచ్చరించింది. దీంతో పాక్ తేసేది లేక వరల్డ్ కప్ కు రావాల్సి ఉంటుంది. ఇక ‘ఇండియా వర్సెస్ పాక్’ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుందని ఇప్పటికీ లీకులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కనీసం ఈ మ్యాచ్ ను చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా లాంటి నగరాలలో పెట్టాలని పీసీబీ కోరుతుంది.
అహ్మదాబాద్ వేదికగా తమకు భద్రతా కారణమైన ఇబ్బందులు ఉంటాయని అందుకే ఈ మ్యాచ్ వేదికను మార్చాలని పీసీబీ కోరుతోంది. అహ్మదాబాద్ ఉన్నరాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనేది అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం క్రికెట్ బోర్డును హెచ్చరిస్తూనే ఉంది. అయితే తాను జైషాతో మాట్లాడానని, ఆసియాకప్ కోసం ఇండియా పాకిస్తాన్ రావడంలో అభ్యంతరం ఏంటో తెలపాలని కోరినట్లు పీసీబీ చైర్మన్ నజం సేథీ ప్రశ్నించారు. దీనికి జైషా ఏమాత్రం స్పందించలేదని సేథీ చెప్పారు. పాకిస్తాన్ లో కాకుండా ఇంగ్లాండ్ లేదంటే యూఏఈలో ఆసియా కప్ – 2023 నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తుంది. ఈ కప్ పై క్లారిటీ వస్తేనే, వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల కానుంది.