India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే వాడుకోవచ్చు. నాలుగున్నర దశాబ్దాలుగా ఈ నదిపై ఆనకట్ట కట్టాలని ఎదురుచూస్తున్న భారత్ కల సాకారమైంది. ఆయనకట్ట ఎట్టకేలకు పూర్తయింది. దీంతో పాకిస్థాన్ కు రావి నీటి ప్రవాహన్ని భారత్ నిలిపివేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
వరల్డ్ బ్యాంకు పర్యవేక్షణలో 1960లో భారత్-పాక్ మధ్య సింధూ జలాల పంపకం విషయంలో ఒక ఒప్పందం (Indus Water Treaty) జరిగింది. ఇందులో సింధూ నది ఉపనది రావి జలాలపై పూర్తి హక్కులు భారత్‌కు దక్కాయి. దీంతో ఆ సమయంలో రావిపై ఆనకట్ట నిర్మించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. 1979లో పంజాబ్, జమ్ము-కశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కూడా జరిగింది.
రావిపై ఎగువన రంజిత్ సాగర్ డ్యాం, దిగువన షాపుర్ కంది బరాజ్ నిర్మించేందుకు జమ్ము-కశ్మీర్ సీఎం షేక్ మహమ్మద్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు కూడా చేశారు. 1982లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పునాది రాయి వేశారు. 1998 నాటికి ఇది పూర్తవ్వాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది.
అడ్డంకులను దాటుకొని..
2001లో రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం పూర్తవ్వగా.. షాపుర్ కంది బరాజ్ నిర్మాణం ఆగిపోయింది. దీంతో పాక్ కు నీటి ప్రవాహం కొనసాగుతూ వస్తోంది. 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు 2013లో నిర్మాణం ప్రారంభించారు. కానీ, పంజాబ్, జమ్ము-కశ్మీర్ మధ్య విభేదాల కారణంగా ఏడాదికే ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. 2018లో కేంద్రం ఇరు రాష్ట్రాల మధ్య మధ్య వర్తిత్వం చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఎట్టకేలకు నిర్మాణం పూర్తవడంతో ఆదివారం (ఫిబ్రవరి 25వ తేదీ) నుంచి పాక్‌కు నీటి ప్రవాహం నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇన్నాళ్లు పాక్‌కు వెళ్లిన నీరు ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. ఈ నీటితో 32 వేల హెక్టార్లు సాగులోకి వస్తుంది. ఈ డ్యామ్ నుంచి ఉత్పత్తయ్యే జల విద్యుత్ లో 20 శాతం జమ్ము-కశ్మీర్ ఇవ్వనున్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పంజాబ్, రాజస్థాన్ కు రావి జలాలు చాలా వరకు ఉపయోగపడనున్నాయి.
1960లో భారత్-పాక్ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. ఇందులో సింధూ, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కగా, రావి, సట్లెజ్, బియాస్ భారత్‌కు దక్కాయి. ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందం ఆమోదయోగ్యంగా ఉందని భావించి దీనిపై సంతకాలు చేశారు.