గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరే
అసెంబ్లీ నియోజకవర్గం : నగరి
వైసీపీ : ఆర్కే రోజా
టీడీపీ : గాలి భానుప్రకాశ్
Nagari Constituency Review : చిత్తూరు జిల్లాలోని ‘నగరి’ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు ఈ సారి ప్రతిష్టాత్మకంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాను ఓడించేందుకు ఇటు చంద్రబాబు, అటు జనసేన కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ రోజాకు ప్రస్తుతం ఎదురు గాలి వీస్తోంది. దీన్ని అవకాశంగా మలుచుకుంటే ఈజీగా గట్టెక్కవచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు.
రాజకీయ నేపథ్యం..
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ‘నగరి’ ఒకటి. 1962లో ఏర్పడిన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నిండ్ర (చిత్తూరు), విజయపురం (చిత్తూరు), నగరి (చిత్తూరు), పుత్తూర్ (తిరుపతి), వడమాలపేట (తిరుపతి) మండలాలు ఉన్నాయి. ఇక ఓటర్ల సంఖ్య తీసుకుంటే 1,94,748 (గత లెక్కల ప్రకారం) మంది ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఇందులో ఎక్కువ సార్లు విజయం దక్కించుకుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ. 13 సార్లు ఈ శాసన సభ నియోకవర్గానికి ఎన్నికలు జరగగా 7 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మూడు సార్లు తెలుగుదేశం పార్టీ రెండు సార్లు విజయం సాధించగా, ఒక్క సారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు.
భౌగోళిక పరంగా, రాజకీయ పరంగా భిన్నమైన ప్రాంతం నగరి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ సీటును దక్కించుకుంది. ఆ తర్వాత మరో రెండు సార్లు పచ్చ జెండాను ఎగురవేసింది. కానీ కేడర్ విషయంలో మాత్రం చతికిలపడిందనే చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు పుట్టిన జిల్లా చిత్తూరు అయినా తెలుగుదేశం కేడర్ కంటే కాంగ్రెస్ కేడరే ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఈ కేడర్ రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా వైసీపీనే గెలుపొందింది. ఆర్కే రోజా రెండు సార్లు విజయం సాధించి ఇప్పడు హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ప్రస్తుతం అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రోజా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ‘నగరి’ నుంచి రోజా వరుసగా రెండు సార్లు గెలుపొందారు. 2014లో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడిపై స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 2019లో గాలి భానుప్రకాశ్ పై కూడా అంతే స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు రోజా. కానీ ప్రస్తుతం ఆమెకు అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
గడప గడపకు జగన్ పథకాలు లాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో ఆమె చతికిలపడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె గెలుపు ఈ సారి కత్తి మీద సాము మాదిరే అన్నట్లు నియోజకవర్గం వ్యాప్తంగా వినిపిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన కామెంట్ల నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ మరింత గుర్రుగా ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తు కొనసాగితే మాత్రం రోజా గెలువడం మరింత కష్టమనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ
చిత్తూరు చంద్రబాబు నాయుడి పుట్టిన జిల్లా. ఆ జిల్లాలో ఆయన టీడీపీ కేడర్ ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు గతంలో వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ పై విపరీతంగా ఆరోపణలు చేస్తున్న రోజాను ఈ సారి ఎలాగైనా ఓడించాలని ఆయన కంకణం కట్టుకున్నారట. ఈ నేపథ్యంలో ఆయన పార్టీలోని సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడి కుటుంబానికి చెందిన గాలి భాను ప్రకాశ్ కు ఈ సారి టికెట్ ఇవ్వాలని దాదాపు ఫైనల్ చేశారట. అయితే గతంలో రోజాపై మరో హీరోయిన్ ను పోటీగా పెట్టాలని అనుకున్న చంద్రబాబు ఆ ఆలోచన కరెక్ట్ కాదని విరమించుకున్నారట.
టీడీపీ సీనియర్ నేత అయిన గాలికి నియోజవకర్గంలో మంచి గుర్తింపు ఉంది. 2009 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేసి జనాల హృదయాలకు దగ్గరయ్యారు. కానీ ఆ తర్వాత రాష్ట్ర మంతటా వైసీపీ గాలి వీస్తుండడంతో అదే గాలిలో రోజా ఆయనను ఓడించారు. కానీ స్వల్ప మెజారిటీతో రోజా గెలుపొందారు. ఇక 2019లో కూడా ఇదే జరిగింది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో గెలుపు నల్లేరుపై నడకే అని చంద్రబాబు భావిస్తున్నారు. ఇంకా గాలి కుటుంబానికి అక్కడున్న పలుకుబడి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సారి సీటు టీడీపీనే వరిస్తుందని టాక్ కూడా వినిపిస్తుంది.