ధనికులు భారత పౌరసత్వం వదులుకొని ఇతర దేశాల్లో స్థిరపడేందుకు సిద్ధమవుతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడి రాజకీయాలు, పరిస్థితులు, మౌలిక, ఆర్థిక అంశాలను ముడిపెడుతూ చాలా వరకు కథనాలు బయటకు వచ్చాయి. తమ వ్యాపారం విస్తృతం చేసుకునేందుకు సంపన్నులు విదేశాలకు తరలివెళ్తున్నారని, అక్కడ అవకాశాలు పెరగడమే ఇందుకు కారణమని అంతా భావిస్తున్నారు.అయితే మరోవైపు అమెరికాలాంటి దేశాల్లో చదువుకుని, కొన్నేళ్లు ఉద్యోగం చేశాక స్వదేశానికి తిరిగి వచ్చేసి వ్యాపారాలు చేసుకునే వారి సంఖ్యపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది. దేశం విడిచి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తున్నవారితో పోలిస్తే.. స్వదేశానికి తిరిగొస్తున్న భారతీయుల సంఖ్య ఎంతున్నదనేదిద ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ రెండు అంశాలపై మధ్య తరగతి ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఏ దేశంలోనైనా చదువు, సంపద, పారిశ్రామికీకరణ ముఖ్యమైన అంశాలు. ఈ క్రమంలో తమ అవసరాలకు అనుగుణంగా సంపన్నులు, ఉన్నత విద్యావంతులు డెవలప్ కంట్రీస్ కు వెళ్లి స్థిరపడతారు. గ్రేట్ బ్రిటన్ నుంచి కూడా ఇలా పెద్ద సంఖ్యలో ప్రజానీకం అమెరికాకు 19వ శతాబ్దం నుంచి వలసపోవడం భారీగా మొదలైంది. 1820–1957 మధ్యకాలంలో ఇంగ్లండ్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన వారి సంఖ్య 45 లక్షలు. బ్రిటన్ నుంచి కూడా అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికాకు వలసపోయారు. ఒక్క 1888లోనే ఇంగ్లండ్ నుంచి 11 లక్షల మంది అమెరికా వెళ్లిపోయినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరి, ఎంతో ప్రగతి సాధించిన బ్రిటన్ నుంచే అంత మంది ప్రజలు వెళ్లిపోయారంటే.. అమెరికా అందించే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికే. స్వదేశంలో వేధింపులు, భవిష్యత్తు లేదనే కారణాలతో మాత్రం వారంతా దేశం దాటలేదు. ఇదంతా 19వ శతాబ్దం నాటి సంగతి.
ఇప్పుడు 21వ శతాబ్దం ప్రథమార్ధంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతున్న ఇండియా నుంచి వివిధ దేశాలకు సంపన్నులు వలస వెళ్తున్నారంటే ఏకైక కారణం అత్యుత్తమ అవకాశాల కోసమే. ఇండియాలో తమకు మంచి జీవనశైలి, భద్రత ఉండదనే కారణం ఎంతకన్నా కాదు. ఇండియా నుంచి వలసలు ఇప్పటిది కాదు. 1834లోనే గయానా, మారిషస్, ఫిజీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని చెరకు తోటలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఒప్పందకూలీలుగా పని చేసేందుకు ఎంతో మంది దేశం దాటి వెళ్లారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల వేధింపులు తట్టుకోలేక కొందరు, మెరుగైన విద్యార్హతలతో మరికొందరు దేశం వదిలి వెళ్లారు. ఇలా ఇతర దేశాలకు వెళ్లినవారిలో కొందరు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని కొన్ని ప్రజాస్వామ్య రాజ్యాల్లో దేశాధినేతలు అయ్యారు. 200 మందికి పైగా భారత సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. వారిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్, గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా ఉన్నారు.
ఇండియా నుంచి సంపన్నులు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. 2011 నుంచి ఇవి మరింతగా పెరిగాయి. 16 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబతున్నాయి. ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. గతేడాది 2,25,62 మంది భారతీయులు ఇతర దేశాల సిటిజన్ షిప్ తీసుకున్నారని అంచనా. 140 కోట్ల జనాభా దాటిన ఇండియా నుంచి ఈ స్థాయిలో సంపన్నలు దేశం దాటడం పెద్ద ఆందోళన కలిగించే అంశమేమీ కాదని సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో విద్యనభ్యసించి పదేళ్లకు పైగా ఉద్యోగం చేసిన పలువురు భారతీయలు అనేక కారణాలతో స్వదేశానికి తిరిగొచ్చి వినూత్న తరహాలో వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇటీవల పెద్ద ఎత్తున పెరుగుతున్నది. వలసలపై దిగులుపడాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఇండియాకు లేదని అర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో అవసరమైనంత ఆర్థిక, మౌలిక, మానవ వనరులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయనేది వారి వాదన.
ReplyForward
|