
America : షారూక్ ఖాన్ నటించిన ‘డుంకీ’ సినిమా గుర్తుండే ఉంటుంది కదా.. మాతృ దేశంలో కోరికలకు, అవసరాలకు తగినంత సంపాదనకు అవకాశం లేదని పంజాబ్ నుంచి ఇల్లీగల్ గా బ్రిటన్ కు పయనమైన పల్లె వాసుల కష్టాల చుట్టూ కథ సాగుతుంది. చేసేదే తప్పుడు పని దాంట్లో కూడా సింపతి పండించేందుకు హైరానా పడ్డాడు దర్శకుడు హిరానీ.
ఈ సినిమా లాగే అగ్రదేశం అమెరికలో చొరబడే వాళ్ల సంఖ్య కూడా తక్కువేమి కాదు. పొరుగుదేశం మెక్సికో నుంచి అమెరికాకు వచ్చిపుడుతుంటారు అధిక శాతం శరణార్థులు, మెక్సికోకు అమెరికాకు మధ్య పెద్ద గోడ ఉంది. అయినప్పటికీ దాన్ని దూకి అమెరికాలో చొరబడుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
టెక్సాస్ రాష్ట్రం మెక్సికో బార్డర్. ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రేంట్స్ ను శరణార్థులుగా గుర్తించే ప్రసక్తే లేదని చెప్పింది ఆ రాష్ట్రం. కానీ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కొలరాడో రాష్ట్రం మాత్రం టెక్సాస్ కు కాకపోతే మా వద్దకు రండి మేం గుర్తిస్తాం అంటోంది. ఇదెక్కడి తీరు? రెండు రాష్ట్రాటు ఒక దేశంలోనే ఉన్నా అంతర్జాతీయ విషయంలో వీళ్ల పెత్తనాలేంటో అర్థం కావడం లేదు. ఇంతకీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన బైడెన్ ఇది ఫెడెరల్ నిర్ణయమని.., రాష్ట్రాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కొలరాడోను కాకుండా టెక్సాస్ ను మందలించాడు.
ఈ శరణార్థులు ఒక్క మెక్సికో నుంచే కాకుంటే వెనెజులా లాంటి పేద దేశాల నుంచి కూడా వస్తున్నారు. రీసెంట్ గా డెనవర్ లో బ్రిడ్జిల కింద టెంట్లు వేసుకొని జీవిస్తున్నాం.. చలికి తట్టుకోలేకపోతున్నాం, ఇళ్లు ఇవ్వాలని అడుగుతున్నారు. మరికొందరైతే తమకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వీళ్లంతా గ్రూపుగా ఏర్పడి కమ్యూనిటీగా గుర్తించాలని కోరుతున్నారు. శరణార్థగా వచ్చి హక్కు గురించి మాట్లాడే వారు చాలా మందే ఉన్నారు. వీళ్లను పోషించేందుకు ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు చేయాల్సి వస్తుంది.
అగ్రరాజ్యమని గుర్తింపు సంపాదించుకున్న అమెరికాను ఆర్థిక సంక్షోభం వెంటాడుతూనే ఉంది. పైకి డాలర్ గొప్పగా కనిపిస్తున్నా.. లోపలంతా డొల్లే.. ప్రపంచంలో ఏ దేశం సంక్షోభంలో ఉన్నా ఆయా దేశాలకు పెద్దనయ్యగా ఫోజులు కొట్టి సైన్యాన్ని పంపి దేశ ఖజానా మీద బరువేసుకంది. మిలిటరీ చర్యలకు అప్పు కూడా చేసింది. దానికి పైన కొవిడ్ సంక్షోభం.. బ్యాంకింగ్ రంగాల్లో లోపాలతో కుప్పకూలడం, ఎక్కడ చూసినా అధికధరలు, ఆపైన గంజాయి లీగలైజ్, గన్ కల్చర్ తో మారణహోమం.. ఇన్నేసి ఇబ్బందులతో సతమతమవుతున్న అమెరికాకు ఈ ఇల్లీగల్ వలసదారులు అవసరమా?
రీసెంట్ గా అక్రమ వలసదారులు పోలీసులపై దాడి చేశారు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. రానురాను పరిస్థితి ఇంకా దిగజారుతుందని ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాన్ మస్క్ కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేశాడు. అసలు అమెరికా ఎటు పోతోందో అని వాపోయాడు. ఇల్లీగల్ ఇమిగ్రేంట్స్ కు బ్యాంకు లోన్లు, ఇన్సూరెన్స్ లు, వైద్యం, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజీ విద్య ఇలా అన్నీ వసతులు కలుగుతున్నాయి. ఇక వేలాది డాలర్లు ట్యాక్స్ కట్టే ఇతర లీగల్ ఇమిగ్రెంట్స్ కు వీరికి తేడా ఏంటని ప్రశ్నించాడు.
సక్రమ వలసదారుల్లోని జంట హెల్త్ ఇన్సూరెన్స్ కు చచ్చినట్టు నెలకు 2000 డాలర్లు కట్టాలి. కానీ అక్రమంగా వచ్చిన వారు ఏమీ చెల్లించకపోయినా ఫ్రీ వైద్యం. ఇదెక్కడి న్యాయం? అసలు ఈ అక్రమ వలసదారులను ఎందుకు రానివ్వాలి? ఈ ప్రశ్నలు అమెరికా జనాభాను ఆలోచింజజేస్తున్నాయి.
H-1B వీసాల ద్వారా క్వాలిఫైడ్ లేబర్ ను దేశంలోకి రప్పించుకోవడం తప్ప బ్లూ కాలర్ జాబ్స్ కోసం తగిన వీసా పెట్టి కార్పెంటర్లకు, ప్లంబర్లకు, బార్బర్లకు, కూలీలకు రాచమార్గంలో వచ్చే వెసులుబాటు కల్పించలేదో! ఎలాగో వస్తున్నారు కదా వారిని వాడుకోవచ్చులే అనుకుంటున్నారు ఆ పాలకులు? అదేం లెక్క?
ఒకప్పటి అమెరికాకు, ఇప్పటి అమెరికాకు చాలా తేడా ఉంది. పద్ధతిగా కాకుండా డంకీ మార్గంలో వచ్చే వలసదారులు పబ్లిక్ గా మల, మూత్ర విసర్జన చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ అసహ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వీళ్లల్లో కొంత మంది నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయే కాకుండా నిషేధిత డ్రగ్స్ అమ్మడం చేస్తున్నారు.
అసలేం సాధిద్దామని పాలకులు వలస శరణార్ధుల పట్ల ఈ ఉదాసీన ధోరణి అవలంభిస్తున్నారో తెలియట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య, భద్రత పరిస్థితులు మరింత అతలాకుతలమయ్యే ప్రమాదం లేకపోలేదు.
కట్టుదిట్టమైన దేశంగా గుర్తింపు సంపాదించుకున్న అమెరికా ఈ విధానాలతో దేశాన్ని దిగజారుస్తుంటే అనాలనిపిస్తుంది కదా.. ‘వాళ్లనలా వదిలేయకండ్రా. ఎవరికన్నా చూపించండ్రా బాబు’ అని!!.