Summer : మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండడంతో పాటు పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా సమ్మర్ సీజన్ లో కార్లలో అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఎండలో నిలిపిన కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం.. అద్దాలు బద్దలు కావడం వంటి ఘటనలను తరుచూ చూస్తూనే ఉంటాం. అయితే ఒక్కొక్కసారి కారులో ఉండే చిన్న చిన్న వస్తువులే ప్రమాదాలకు కారణమవుతుంటాయి. వాటి పట్ల మనం ముందు జాగ్రత్తగా ఉండే ప్రమాదాలను నివారించవచ్చు. కారులో మంటలు, పేలుడుకు కారణమయ్యే వస్తువులు ఇవే..
సన్ గ్లాసెస్:
కార్లు వాడే వారికి సాధారణంగా సన్ గ్లాస్ లు వాడే అలవాటు ఉంటుంది. వాడిన తర్వాత వాటిని డ్యాష్ బోర్డుపై పెట్టేస్తుంటారు. ఎండలో పార్క్ చేసిన సమయంలో అవి భూతద్దంలా పనిచేసి అగ్ని ప్రమాదానికి కారణమవుతాయి. ప్లాస్టిక్ ఫ్రేమ్ కళ్లజోడు అయితే వేడికి కరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
స్ప్రే క్యాన్లు:
సెంట్లు, రూం స్ప్రే వంటి క్యాన్లను కారులో ఉంచకూడదు. వీటిలో ఉండే స్పిరిట్ కారణంగా ఉష్ణోగ్రత పెరిగే కొద్ది ఆ డబ్బాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఒక దశలో ఇవి పేలే ప్రమాదముంది.
లైటర్లు:
ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు పొరపాటున లైటర్లను కార్లలో వదిలేయవద్దు. వాహనం ఎక్కువ సేపు ఎండలో ఉంటే వీటి నుంచి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది.
బ్యాటరీలు:
వాడిన పాత లేదా కొత్త బ్యాటరీలను కారు లోపల ఉంచొద్దు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి లీక్ అయ్యే ప్రమాదముంది. వీటిల్లోని యాసిడ్లు విషపూరితమైనవి. దీంతో పాటు కారు ఇంటీరియర్ దెబ్బతినొచ్చు.
మేకప్ కిట్స్:
మహిళలు ఉపయోగించే మేకప్ కిట్స్ ను కూడా కారులో ఉంచొద్దు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వీటికి మండే స్వభావం ఉంటుంది. కొన్ని కరిగిపోయి దెబ్బతినొచ్చు.
లిక్కర్, శానిటైజర్లు:
మద్యం సీసాలను కార్లలో ఉంచి పార్క్ చేసినప్పుడు కార్బొనేటెడ్ డ్రింక్స్ పేలే ప్రమాదం ఉంది. అలాగే హ్యాండ్ శానిటైజర్స్ లో ఆల్కహాల్ ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రతల వద్ద మంటలు సృష్టిస్తాయి.
ఇవే కాక పలు వస్తువులకు మండే, పేలే స్వభావం ఉంటుంది. కాబట్టి కార్లలో వాటిని ఉంచకపోవడమే మంచిది. ఒకవేళ ఉంచినా కారును ఎండలో పార్క్ చేస్తే మన వెంట తీసుకెళ్లడం మంచిది.