ప్రమాదాల నివారణకు ఇటలీ ప్రభుత్వం ఏర్పాట్లు
మద్యసేవనాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ పలువురి విమర్శలుః
ఆక్సిడెంట్ల నియంత్రణకు మేలు చేస్తుందంటూ మరికొందరు సపోర్ట్
Alcohol మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకు ఇటలీ ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబిస్తోంది. ఇందుకోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద ఎవరైనా ఇటలీలో బయట అతిగా మద్యం తాగితే అతడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఉచిత టాక్సీ సౌకర్యం కల్పిస్తుంది. ఇటలీ ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టడమే దీని లక్ష్యం. ఉప ప్రధాన మంత్రి మాటియో సాల్విని నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎలా అమలు చేస్తారు.. ?
దేశవ్యాప్తంగా ఆరు నైట్ క్లబ్‌లలో పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తారు. ఇది పుగ్లియా యొక్క దక్షిణ ప్రాంతం నుంచి టుస్కానీ, వెనెటో ఉత్తర ప్రాంతాల వరకు అమలు అవుతుంది. నైట్‌క్లబ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించే వ్యక్తులను ఆల్కహాల్ నిర్దారణ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయి చట్టబద్ధమైన పరిమితికి మించి ఉందని తేలితే, వారిని ఇంటికి తీసుకెళ్లడానికి టాక్సీ రైడ్ ఖర్చును ప్రభుత్వం ఏర్పాటు చేసి భరిస్తుంది. రవాణా మంత్రిత్వ శాఖ ఈ ఖర్చును భరిస్తున్నది.
సోషల్ మీడియా వేదికగా ప్రకటన
మాటియో సాల్విని తన సోషల్ మీడియా ఖాతాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రోడ్లపై జరిగే ప్రమాదాలు, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ ఆచరణాత్మక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జరిమానాలు, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రస్తుతమున్న చట్టాలు ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సరిపోవని అభిప్రాయపడ్డారు. రహదారి భద్రత విషయంలో ప్రభావవంతమైన వ్యక్తులను సంప్రదించిన తర్వాత ఈ ఆలోచన చేసినట్లు ఆయన తెలిపారు.
మిశ్రమ స్పందన
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నది. మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాల సమస్య పరిష్కారానికి ఇదే సానుకూల చర్యగా పలువురు అభిప్రాయపడుతుండగా, తాగుబోతు వల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడంలో ఈ సమస్య సహాయపడుతుందని మరికొందరు నమ్ముతున్నారు. అయితే ఇది అధికంగా మద్యం సేవించే వారిని మరింత ప్రోత్సహించడంతో పాటు ఫ్రీ రైడ్ బహుమతిగా ఇచ్చినట్లు అవుతుందని పలువురు పేర్కొటున్నారు.