Instagram : ఇది సెల్ ఫోన్ యుగం. కడుపులో ఉండగానే తల్లి సెల్ ఫోన్ లో యూట్యూబ్ , షార్ట్స్ ను పిల్లాడు ఎంజాయ్ చేస్తున్నాడు. పుడుతూనే సెల్ ఫోన్ రింగ్ టోన్ వింటున్నాడు. ఐదారు నెలల నుంచే సెల్ ఫోన్ లో చిల్డ్రన్ కామిక్స్, షార్ట్స్ చూస్తున్నాడు. సెల్ ఫోన్ చేతికి ఇవ్వకుంటే నానా అల్లరి చేస్తున్నాడు. పిల్లల పరిస్థితే ఇలా ఉంటే యువత పరిస్థితి ఎలా ఉండాలి. రోజులో గంటల తరబడి సెల్ ఫోన్ లోనే వాళ్లకు గడిచిపోతోంది. యూట్యూబ్ , షార్ట్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, వాట్సాప్..ఇలా సోషల్ మీడియాలోనే బతుకుతున్నారు.
సెల్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి శరీరంలో భాగమైపోయినట్టుగా తయారైపోయింది. సెల్ ఫోన్ లోనే వ్యక్తి సమాచారం సర్వం ఉంటోంది. లేచిన దగ్గర నుంచి పడుకునే దాక సెల్ ఫోన్ లో లీనం కావడం తప్పనిసరై పోయింది. అయితే అబ్బాయిల విషయం ఎలా ఉన్నా.. అమ్మాయిలు మరింతగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ ను అయితే విపరీతంగా వాడేస్తున్నారు. తాము చేస్తున్న ప్రతీ పనిని అందులో షేర్ చేసి తమ జీవితాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు.
ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అమ్మాయిలు ఇన్ స్టాలో పర్సనల్ విషయాలు షేర్ చేస్తుండడంతో కొందరు కేటుగాళ్లు వారిని మోసం చేస్తున్నారు. వారి పరువును సభ్యసమాజం ఎదుట గంగలో కలుపుతున్నారు. ఆకతాయిల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కేటుగాడిని ఇవాళ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన 29 ఏండ్ల యువకుడు ఫేక్ అకౌంట్లు సృష్టించి అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. అమ్మాయిలకు రిక్వెస్ట్ పంపి వాట్సాప్ నంబర్ తీసుకునేవాడు. బాధితుల నగ్న ఫొటోలు సేకరించి, రీచార్జ్ చేయకుంటే వైరల్ చేస్తానని బెదిరించేవాడు. ఇతడొక్కడే కాదు ఇలాంటి వారు ఎంతో మంది సోషల్ మీడియా గ్రూపుల్లో అమ్మాయిలను వేధిస్తున్నారు. అందుకే జాగ్రత్త ఉండడం చాలా మంచిది.