
Pathuri Nagabhushanam : ‘యూ బ్లడ్ యాప్’ ద్వారా లైవ్ బ్లడ్ దొరుకుతుంది.. అందుకే ఈ యాప్ డా. జగదీష్ బాబు యలమంచిలి గారు దగ్గరుండి రూపొందించారని యూ బ్లడ్ యాప్ కన్వీనర్, బీజేపీ ఏపీ స్టేట్ మీడియా ఇన్ చార్జి పాతూరి నాగభూషణం అన్నారు. విజయవాడలోని సాయి ఇంటర్ మీడియట్ కాలేజీలో రెడ్ క్రాస్ బ్లడ్ ఆధ్వర్యంలో ‘యూ బ్లడ్ యాప్’ నిర్వహించిన రక్తదాన శిబిరానికి బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి హాజరయ్యారు.
కార్యక్రమం ఆసాంతం కన్వీనర్ పాతూరి చేతుల మీదనే జరగగా.. ముఖ్య అతిథిగా పాల్గొన్న పురంధేశ్వరి రక్తదాతలను అభినందించారు. అనంతరం పాత్రికేయులతో జరిగిన మీడియా మీట్ లో యూ బ్లడ్ యాప్ కన్వీనర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ యాప్ గురించి క్షుణ్ణంగా వివరించారు. ఆయన ఏమన్నాడంటే..
‘రక్తనిధి (Blood Bank) కేంద్రాల్లో ఉన్న రక్తం సేకరించిన తర్వాత కేవలం మూడు నెలల వరకు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత వృథాగా పారబోయాల్సి వస్తుంది. ఈ మూడు నెలల వరకు కూడా దాన్ని కాపాడేందుకు చాలా ఇబ్బంది ఉంటుంది. దీంతో లైవ్ బ్లడ్ డొనేట్ చేయాలన్న సంకల్పంతో డా. జగదీష్ బాబు యలమంచిలి గారు ‘యూ బ్లడ్ యాప్’ తయారు చేశారు. ఈ యాప్ ద్వారా గ్రహీతకు దాత సమీపంలో ఉంటే మరింత తొందరగా రక్తం ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ యాప్ ద్వారా చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందుకే ఎక్కువ మొత్తంలో దాతలు ఇందులో ఉన్నారు. కాబట్టి ఈ యాప్ వాడకాన్ని పెంచి మరింత వేగంగా కావాల్సిన వారికి బ్లడ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం’. అని నాగభూషణం చెప్పారు.