Pawan Kalyan : ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు నడుపడం అంతా ఈజీ కాదు. ఈ కాలంలో గాంధీ, సుభాష్ చంద్రబోస్ పార్టీ పెట్టినా ఓడిపోతారని రాజకీయాలంటే నిర్వేదకులు వాపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో సినీ జనాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ తో సీఎం అయిపోతామని కలలు కంటుంటారు. అయితే అది క్షేత్రస్థాయిలో వర్క్ వుట్ కావడం లేదు. నాలుగు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ కాలం నాటి పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్లు పాలించడం, అవినీతి, దోపిడీ, తెలుగు వారంటే జాతీయ నాయకులకు చిన్నచూపు, తరుచూ సీఎంలను మార్చడం, కాంగ్రెస్ కు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం..ఇలా పలు కారణాలతో కాంగ్రెస్ పార్టీని ఛీ కొట్టి ఎన్టీఆర్ ను అందలం ఎక్కించారు ఏపీ జనాలు.
కానీ ప్రస్తుతం ఆయన బతికొచ్చి ఇప్పటి రాజకీయాలను భరించి సీఎం కావడం అసాధ్యం. అలా మారిపోయాయి రాజకీయాలు. ఇవన్నీ గుర్తించకుండానే కొందరు సినీ నటులు పార్టీలు పెట్టి అభాసుపాలయ్యారు. గత దశాబ్ద కాలంలో పలువురు సినీ నటులు పార్టీలు పెట్టినా.. వాటిలో మనుగడ సాగించలేక చేతులేత్తెశారు. తమిళనాడులో విజయ్ కాంత్, కమల్ హాసన్ ల పరిస్థితి ఇదే. విజయ్ కాంత్ ఒకటి, రెండు ఎమ్మెల్యే సీట్లే గెలుచుకునేవారు. ఇక కమల్ హాసన్ పార్టీ ఉందా లేదా అనేది కూడా తెలియదు. వీరందరితో పోలిస్తే చిరంజీవి మాత్రమే ఎంతో కొంత మంచి ఫలితాలనే సాధించారు. 2009 ఎన్నికల్లో విపరీతమైన పోటీ మధ్య 18 సీట్లు గెలవడమే కాదు, భారీ ఓట్ల శాతాన్ని సైతం రాబట్టారు. కానీ అనుకోని కారణాల వల్ల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తనకు రాజకీయాలు సెట్ కావని, మళ్లీ సినీ పరిశ్రమ వైపు వెళ్లారు.
ఇక పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు అవుతోంది. ఆ పార్టీ ఇంతవరకు ఎలాంటి ప్రభావం చూపించలేదు. 2014లో పోటీ చేయలేదు. 2019లో ఒక్క సీటు మాత్రమే గెలిచారు. స్వయంగా పవన్ కల్యాణే పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడంతో జనసైనికులతో పాటు కాపు సామాజికవర్గ నేతలు విమర్శిస్తున్నారు. 24 సీట్లకు పవన్ ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై పవన్ మొన్నటి టీడీపీ, జనసేన ‘జెండా’ సభలో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
తన దగ్గర డబ్బులు లేవని, తనకు బూత్ లెవల్ లో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేదని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు తనకు 24 సీట్లు ఇవ్వడం సమంజసమేనన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోయి పరువు తీసుకునే కంటే తక్కువ సీట్లు తీసుకుని అన్ని సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. జగన్ రెడ్డిని అధికారంలోకి దించడానికే తాము పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కోట్ల రూపాయలు వచ్చే సినిమాలను వదలేసి రాజకీయాల్లోకి వచ్చానని, సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నానన్నారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. రాజకీయాల్లో మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీ సొంత డబ్బులను ఎవరు ఖర్చు చేయమన్నారు? పార్టీని నడిపే శక్తే లేకుంటే ఇక రాజకీయాలు ఎందుకని విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీలు పెట్టి నడిపించుకోవడం లేదా? రాజకీయాల్లో గెలపొటములు సహజమే కానీ.. పార్టీ అధినేతే ఇలా ఢీలా పడే మాటలు మాట్లాడితే ఇక శ్రేణుల పరిస్థితి ఏమిటని అంటున్నారు. రాజకీయాల్లో ఉండేవారు తమ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలి.. క్యాడర్ లో ఉత్సాహం నింపాలి..కానీ అధినేతే ఇలా పార్టీ సంస్థాగత లోపాలను బయట పెడితే ఇక జనాలు ఓటు వేయడానికి ముందుకొస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తుందన్న పార్టీకి మాత్రమే ఓట్లేస్తారు కానీ ఓడిపోతుందనుకున్న పార్టీకి ఓటు వేయడానికి అంతగా ఇష్టపడరు. ఇది గతంలో ఎన్నో సార్లు రుజువైంది కూడా. ఒక రాజకీయ పార్టీని ఎలా నడుపాలి అనేది తెలుసుకోవాలంటే కేజ్రీవాల్ ను, కేసీఆర్, జగన్ లను చూసి నేర్చుకోవాలి.. పార్టీని ఎలా నడుపకూడదో పవన్ చూసి నేర్చుకోవాలని విశ్లేషకులు ఎద్దేవా చేయడం గమనార్హం.