CM Revanth : తెలంగాణ రాజకీయాలు గత కొద్దికాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టు తిరుగుతున్నాయి. ఎన్నికల వేళ పిల్లర్లు కుంగిపోవడం నుంచి షురువైన జగడం ఇప్పటికీ తెగడం లేదు. కేసీఆర్ మానస పుత్రికగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుతోనే బీఆర్ఎస్ ను, కేసీఆర్ రాజకీయ భవిష్యత్ కు గట్టి దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందంటున్న రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తును ఎందుకు కోరడం లేదనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
కాళేశ్వరం విషయంలో గతంలో కోర్టులో ఒక పిటిషనర్ దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన క్రమంలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేయడం లేదని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సీబీఐ అధికారులను వివరణ కోరింది.
దీంతో సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే తమకు కావాల్సిన వనరులను సమకూరిస్తే తమకు దర్యాప్తు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని సీబీఐ పేర్కొంది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మరో పక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణకు సీబీఐ రెడీగా ఉన్నా రేవంత్ కావాలనే సీబీఐకి దర్యాప్తు అప్పజెప్పడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ కు ఓ రకంగా రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దానిలో జరిగిన అవినీతిపై తూర్పార పడుతున్న రేవంత్ రెడ్డి తాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరితే కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తుకు ఓకే చెప్పిందని పేర్కొన్నారు. సీబీఐ కంటే న్యాయమూర్తి సారథ్యంలోనే దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందని రేవంత్ చెబుతున్నారు. సీబీఐ కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి బీజేపీ.. కేసీఆర్ ను రక్షించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే త్వరలోనే లోక్ సభ ఎన్నికలు ఉండడంతో కాళేశ్వరంలో అవినీతి ప్రధాన అంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కేసీఆర్ ను, బీఆర్ ఎస్ ను ఇరుకున పెట్టి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్, బీజేపీలు చూస్తున్నాయి. ఈక్రమంలో రేవంత్ సీబీఐ విచారణకు ఆసక్తిచూపడం లేదని అర్థమవుతోంది.