తెలుగుజాతి గొప్పతనం , తెలుగు జాతి ఔన్నత్యాన్ని….. తెలుగింటి సంప్రదాయాలను కొనసాగిస్తూ తెలుగు తనానికి నిర్వచనంగా నిలుస్తున్నారు ప్రవాసాంధ్రులు. ఖండాంతరాలను దాటి ప్రవాస భారతీయులుగా జీవితాన్ని కొనసాగిస్తున్న మన తెలుగు వాళ్ళు తాము ఉంటున్న చోట కూడా తెలుగింటి సంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు తమ పిల్లలకు తెలుగింటి ఆచార వ్యవహారాలను నేర్పిస్తూ వాటిలోని మాధుర్యాన్ని , గొప్పతనాన్ని ఆస్వాదించేలా చేస్తున్నారు. ఇక పండుగల విషయంలో అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా అమెరికాలోని ఎడిసన్ లో ” వాసవి సొసైటీ – NRI వాసవి అసోసియేషన్ ఆఫ్ NJ/ NY ” ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ , న్యూయార్క్ లకు చెందిన పలువురు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు , పిల్లలు , యువతీయువకులు , పురుషులు పాల్గొన్నారు. మొత్తంగా 600 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పిల్లలకు భోగి పళ్ళు పోశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంప్రదాయబద్ధమైన ఈ కార్యక్రమాలను యూత్ ఆర్గనైజ్ చేయడం విశేషం.
ప్రముఖ నేపథ్య గాయని అంజనా సౌమ్య పలు సూపర్ హిట్ పాటలను అలపించి ఆహూతులను అలరించారు. అలాగే అంజనా సౌమ్య తో కలిసి లోకల్ సింగర్ ప్రసాద్ సింహాద్రి పాటలను ఆలపించాడు. పిల్లలు , పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి సంక్రాంతి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. వాసవి సొసైటీ – NRI వాసవి అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సంక్రాంతి పండుగ గొప్పతనం తెలిసేలా కార్యక్రమాలను నిర్వహించారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.