
కింగ్ నాగార్జునకు షాక్ ఇచ్చింది ది ఘోస్ట్ చిత్రం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్మోహన్ సంయుక్తంగా నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ చిత్రం విడుదలైంది. మొదటి రోజునే కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది ది ఘోస్ట్ చిత్రం. దాంతో రెండో రోజునే చాలా చోట్ల సినిమాను లేపేశారు.
నాగార్జున కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది ది ఘోస్ట్. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం నాగార్జున చాలా కష్టపడ్డాడట. 60 ప్లస్ ఏజ్ లో కూడా కత్తులు కటార్లు చేతబట్టి యుద్ధం చేస్తే బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేయడంతో ఖంగుతిన్నారు అక్కినేని అభిమానులు సైతం. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో నాగార్జున ఒకరు అనే సంగతి తెలిసిందే.
తనతోటి హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ బాక్సాఫీస్ ను దున్నేస్తున్నారు కానీ నాగార్జున మాత్రం 100 కోట్ల మైలురాయిని చేరుకోలేకపోయాడు. చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ లు 100 కోట్ల క్లబ్ లో చేరారు కానీ నాగ్ మాత్రం ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ది ఘోస్ట్ ఇచ్చిన షాక్ తో నాలుగు నెలల పాటు సినిమాలు చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు నాగార్జున. నాలుగు నెలల తర్వాత ఎలాంటి చిత్రాలు చేయాలి అనేది నిర్ణయించుకుంటాడట పాపం.