ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న సమయంలోనే కృష్ణంరాజు కూడా నటుడిగా చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. ఎన్టీఆర్ , అక్కినేని తెలుగునాట తిరుగులేని హీరోలుగా రాణిస్తుండగా కృష్ణ , శోభన్ బాబు లు యువ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక వాళ్ళ తో పోటీ పడి కృష్ణంరాజు పలు అవకాశాలు దక్కించుకున్నారు. అయితే సక్సెస్ పరంగా మాత్రం కృష్ణంరాజును దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉన్నారు. అంతేకాదు విలన్ పాత్రలు కూడా పోషించాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక భారీ ఆకారం కావడంతో నెగెటివ్ పాత్రలు కృష్ణంరాజు ను వెతుక్కుంటూ వచ్చాయి.
అయితే వచ్చిన అన్ని పాత్రలను పోషించలేదు. ఎందుకంటే నాకు స్పెషల్ ఐడెంటిటీ ఉంటేనే ఆ పాత్రలు చేస్తానని చెప్పి మరీ అలాంటి పాత్రలను మాత్రమే పోషించారు. దాదాపు 30 చిత్రాల్లో నెగెటివ్ పాత్రలను పోషించి మెప్పించారు కృష్ణంరాజు. ఇక ఆ తర్వాత సొంత చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి అద్భుతమైన చిత్రాలను పోషించి హీరోగా బాక్ బౌన్స్ అయ్యారు. ఎన్టీఆర్ , అక్కినేని, కృష్ణ , శోభన్ బాబు ల తర్వాత స్థానాన్ని ఆక్రమించారు కృష్ణంరాజు. విలన్ గా మెప్పించడమే కాదు తిరిగి హీరోగా తనని తాను నిరూపించుకున్న విధానానికి కృష్ణంరాజు కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిజంగా రెబల్ స్టార్ అనే బిరుదు నూటికి నూరు పాళ్లు కృష్ణంరాజు కు సరిపోతుంది. ఎందుకంటే ఆయన పోరాట పటిమ అలాంటిది మరి. ఎన్టీఆర్ , అక్కినేని , కృష్ణ , శోభన్ బాబు లతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు , డాక్టర్ రాజశేఖర్, వెంకటేష్ , రాజేంద్రప్రసాద్, సుమన్ లాంటి హీరోలతో కూడా పలు చిత్రాల్లో నటించారు. అలాగే తన సినీ వారసుడు ప్రభాస్ తో కూడా కలిసి నటించారు.