యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు కోసం అమెరికా పయనమయ్యాడు. ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అమెరికాకు పయనమయ్యాడు. మార్చి 12 న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం నుండి ఎస్ ఎస్ రాజమౌళి , ఎం ఎం కీరవాణి , హీరో రాంచరణ్ , సింగర్ కాలభైరవ లతో పాటుగా రాజమౌళి , కీరవాణి కుటుంబాలు అక్కడే మకాం వేసాయి.
ఇక ఇప్పుడేమో జూనియర్ ఎన్టీఆర్ అగ్రరాజ్యం అమెరికాకు పయనమయ్యాడు. అన్న నందమూరి తారకరత్న మరణంతో ఎన్టీఆర్ కొద్ది రోజులు ఆలస్యంగా అమెరికాకు వెళ్తున్నాడు. గతనెలలో నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దాంతో అన్నయ్య పెద్ద కర్మ అయ్యేంత వరకు ఉండి అమెరికాకు వెళ్తున్నాడు.
ఆస్కార్ బరిలో నాటు నాటు అనే సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ పాటను చంద్రబోస్ రాయగా కీరవాణి సంగీతం అందించాడు. ఇక ఆలపించింది కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్. ఇక ఈపాటను లైవ్ లో పాడనున్నారు కాలభైరవ – రాహుల్ సిప్లిగంజ్. అలాగే అదే స్టేజ్ మీద ఎన్టీఆర్ – చరణ్ కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేయనున్నారట. ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్ అవార్డు అందుకోవడం గ్యారంటీ అని తెలుస్తోంది. అందుకే ఇంతటి హంగామా ! ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ వస్తే భారతీయ సినిమాకు దక్కుతున్న గౌరవంగా భావించాల్సి ఉంటుంది.