మహానటులు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర్ రావు కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ” శ్రీ కృష్ణార్జున యుద్ధము ”. కెవి రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జయంతి పిక్చర్స్ పై నిర్మించారు. 1963 జనవరి 9 న ఈ చిత్రం విడుదలై ఆంధ్రదేశమంతటా అఖండ విజయం సాధించింది. పెండ్యాల నాగేశ్వర్ రావు సంగీతం అందించగా పింగళి సాహిత్యం అందించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 10 పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
శ్రీకృష్ణుడుగా నందమూరి తారకరామారావు నటించగా అర్జునుడిగా అక్కినేని నాగేశ్వర్ రావు నటించారు. ఇక కీలక పాత్రల్లో బి. సరోజాదేవి , గుమ్మడి , మిక్కిలినేని , కాంతారావు , ధూళిపాళ , వి. నాగయ్య , ముక్కామల , సత్యనారాయణ , ప్రభాకర్ రెడ్డి , అల్లు రామలింగయ్య , చదలవాడ , వరలక్ష్మీ , మహంకాళి వెంకయ్య , శ్రీరంజని ,ఛాయాదేవి , సురభి బాలసరస్వతి తదితరులు నటించారు.
” అన్నీ మంచి శకునములే ” , ” అలిగితివా సఖి ”, ” మనసు పరిమళించెనే ” , ” దేవ దేవ నారాయణ ”, ” చాలదా ఈ పూజ దేవి ” , ”నీకై వేచితినయ్యా ” , ” స్వాముల సేవకు వేళాయె ” , ” తపము ఫలించిన శుభవేళ ”, ” వేయి శుభములు కలుగు నీకు ” వంటి పాటలు బహుళ జనాదరణ పొందాయి.
ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా నటించగా అర్జునుడుగా అక్కినేని నటించడం విశేషం. ఈ ఇద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాగే పోరాట సన్నివేషాలు కూడా ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠ కు గురి చేసాయి. ఇద్దరు కూడా పెద్ద హీరోలు కావడంతో నందమూరి – అక్కినేని అభిమానుల మధ్య తీవ్ర పోటీ ఉండేది. శ్రీకృష్ణార్జున యుద్ధము చిత్రం విడుదలై సరిగ్గా 60 ఏళ్ళు దాటింది. దాంతో అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు అభిమానులు.