ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డూలను (ఒక్కో లడ్డూ.. 25 గ్రాములు) పంపించనుంది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఇలా మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు, తితిదే డిప్యూటీ ఈవో శివప్రసాద్, పోటు ఏఈవో శ్రీనివాసులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.