
Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ మరో మలుపు తిరిగింది. శుక్రవారం (మే 19) ఉదయం 11 గంటలకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. అవినాశ్ రెడ్డి విచారణకు బయల్దేరుతున్నారని తొలుత ప్రచారమైంది. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు అవినాశ్ రెడ్డి. ఆయన సీబీఐ అధికారులకు ఒక లేఖ రాశారు. తన తల్లికి అనారోగ్యం దృష్ట్యా ఈ రోజు కాకుండా మరో రోజు విచారణకు వస్తానని లాయర్ల ద్వారా లేఖను పంపారు.
అవినాశ్ తల్లి అనారోగ్యం కారణంగా ఆయన విచారణకు హాజరుకాలేరన్న విషయాన్ని లాయర్లు సీబీఐ కార్యాలయానికి వెళ్లి తెలియజేశారు. తన తల్లి శ్రీలక్ష్మికి హర్ట్ ఎటాక్ వచ్చిందని.. ఆమెను వెంటనే పులివెందులలోని దినేశ్ హాస్పిటల్ లో చేర్చినట్లు సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు వస్తున్న సమయంలో తల్లికి గుండెపోటు వచ్చిందని తెలిసిందని, అందుకే దాదాపు సగం దూరం వచ్చిన అవినాశ్ రెడ్డి తిరిగి పులివెందుల బయల్దేరి వెళ్లారని సీబీఐకి సమాచారం ఇచ్చారు. అవినాశ్ తండ్రి జైలులో ఉండడంతో తల్లిని చూసుకునే వారు ఎవరూ లేక తను రాలేకపోతున్నానని చెప్పాడు. విచారణను మరో తేదీ నిర్వహించాలని సీబీఐని లేఖ ద్వారా అభ్యర్థించారు.
ఉదయం 10.30 గంటలకు ఎంపీ సీబీఐ కార్యాలయానికి బయల్దేరారన్న ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఫోన్ రావడంతో తిరుగు ప్రమాణం అయ్యారట. ఈ నెల 16న కూడా విచారణకు రమ్మని సీబీఐ నోటీసులిచ్చింది. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో ఆ రోజు విచారణకు రాలేనని హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లారు. తాను విచారణకు రాలేనని.. నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. దీంతో సీబీఐ శుక్రవారం (మే 19, శుక్రవారం) రావాలని నోటీసులిచ్చింది. ఈ రోజు కూడా డుమ్మా కొట్టడంతో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠ నెలకొంది.
వైఎస్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంను అభ్యర్థించాడు. ఈ క్రమంలో అవినాశ్ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలని ఆదేశాలివ్వాలని కోరారు. సుప్రీం పరిశీలనలో ఉన్నందున ఈ పిటిషన్‌పై విచారణ వేగంగా జరగడం లేదని.. అప్పటి వరకూ సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాశ్ కోరారు.