
CBI Notices : కడప పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) అవినాశ్ రెడ్డి, సీబీఐ మధ్య లేఖలు, నోటీసుల పర్వం కొనసాగుతూనే ఉంది. సీబీఐ దర్యాప్తు చేపట్టిన వివేకా హత్య కేసులో మంగళవారం (మే 16) రోజున హాజరవ్వాలని సీబీఐ నోటీస్ జారీ చేసింది. అవి షార్ట్ నోటీసులని, విచారణకు హాజరవ్వలేనని అవినాశ్ రెడ్డి సీబీఐకి తిరిగి లేఖ రాశారు. పార్టీ కార్యక్రమాలతో ప్రస్తుతం సతమతం అవుతుండడం వల్ల 4 రోజుల గడువు కావాలని లేఖలో ఆయన సీబీఐకి వివరించారు. ఈ లేఖకు రిప్లయ్ ఇచ్చిన సీబీఐ.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సీఆర్పీసీ-160 కింద నోటీసులు ఇచ్చింది. శుక్రవారం (19వ తేదీ) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. వాట్సాప్ ద్వారా అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపింది. ఎంపీ హైదరాబాద్ నుంచి పులివెందులకు తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో సీబీఐ నోటీసులు అందజేసింది.
మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ సోమవారం(మే 15) నోటీసులు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే విచారణకు హాజరుకాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి తిరిగి లేఖ రాశారు. విచారణ కోసం తనకు షార్ట్ నోటీస్ ఇచ్చారని, 4 రోజుల పాటు పార్టీ కార్యక్రమాల బిజీ షెడ్యూల్ తో వచ్చేందుకు టైమ్ లేదన్నారు. కనీసం 4 రోజుల గడువు కావాలని కోరారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో రాలేనని చెప్పారు. అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లారు.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నుంచి చాలా విషయాలు బయటపడుతాయని సీబీఐ భావిస్తోంది. విచారణ నిమిత్తం సీబీఐ ఆ రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి తోడు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఆయనను అరెస్టు చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ.. ఆ విషయంలో సీబీఐ ఆచితూచి వ్యవహరిస్తుందని తెలుస్తోంది. 20 రోజుల పాటు అవినాశ్ రెడ్డిని విచారణకు పిలవలేదు. తాజాగా నోటీసులు జారీ చేయడంతో అరెస్టుపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని అవినాశ్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.