Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెబుతుంటారు. పొట్టకూటి కోసమే కోటి విద్యలు అనే సామెత కూడా ఉంది. ఏ పని చేసినా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకే అని కూడా చెబుతుంటారు. ఇప్పటికీ దేశంలో ఎంతో మంది సరైన తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొందరు తిండి ఎక్కువై ఇబ్బందులు పడే వారున్నారు. మన దేశంలో ఎక్కువ మంది బియ్యం అన్నం తింటారు. మూడు పూటల ఈ అన్నమే తింటారు. దీనివల్ల ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉన్న వారికి పెద్దగా నష్టం లేకపోయినా శారీరక శ్రమలేనివారికి బియ్యం అన్నం నష్టం చేకూరుస్తుందని అంటారు. బాగా పాలిష్ చేసిన బియ్యంతో అన్నం వండి తింటే, వాటి నుంచి కార్బోహైడ్రేట్స్, కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే కాబట్టి బరువు పెరగడం నుంచి గ్లూకోజ్ స్థాయిలు, కొలెస్ట్రాల్ పెరగడం వరకు అనేక సమస్యలు వస్తాయి.
బియ్యం బదులుగా తినగలిగిన ఆరోగ్యకరమైన ఆహారాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఆరోగ్యకరమైన, బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
క్వినోవా:
క్వినోవా ధాన్యం మాదిరిగానే కనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే చాలా మంది క్వినోవాను అన్నం మాదిరిగానే వండి ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ గా లభిస్తుంది. అంటే ఇందులో మొత్తం 9 ముఖ్యమైన అమైనో అమ్లాలు, ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని సలాడ్లు, సూప్ లు, స్ట్రైర్ ఫ్రైస్, డెజర్ట్స్ లో మిక్స్ చేసి తినవచ్చు.
బార్లీ:
ఇది పురాతన పంటల్లో ఒకటి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. డైజెషన్, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బార్లీలో బీటా గ్లూకాన్ అనే ఒక రకమైన సాలిబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కాలీఫ్లవర్:
కాలీఫ్లవర్ లో కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సీ, ఫోలేట్, ఫైటో కెమికల్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాలిఫ్లవర్ ను చిన్న ముక్కలుగా తరిగి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. దీన్ని బ్లెండ్ చేసి అన్నంలా తయారు చేసుకోవచ్చు. దీనిని మసాలాలు, చీజ్ లేదా వెన్నతో కలిపి తినవచ్చు.
ఫారో:
ఫారో బియ్యం గింజల కంటే పెద్దదిగా ఉంటుంది. ఫారోలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, బీ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫారో లిగ్నాన్స్ కు మంచి మూలం. ఫారో లిగ్నాన్స్ లో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఫారోను నీరు లేదా పులుసులో యాడ్ చేసి వండవచ్చు. దీనిని సలాడ్లలో మిక్స్ చేసి తినవచ్చు.
హోల్ వీట్ కౌస్కాస్:
హోల్ వీట్ కౌస్కాస్ అనేది గోధుమ పిండి, నీటితో తయారు చేసిన పాస్తా. హోల్ వీట్ కౌస్కాస్ సాధారణ కౌస్కాస్ కంటే ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు ఉంటాయి. దీన్ని త్వరగా సులభంగా కుక్ చేసుకోవచ్చు. దీనిని మసాలాలు నట్స్, డ్రైఫ్రూట్స్ లేదా కూరగాయలతో కలిపి తినవచ్చు.