Kavitha : కల్వకుంట్ల కవిత.. కేసీఆర్ బిడ్డగానే కాకుండా.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావశీల మహిళ.. మంచి వాగ్ధాటితో రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నది. ఇటీవల మద్యం స్కాం ఆరోపణలు చుట్టుముట్టినా, వాటి నుంచి బయటపడగలిగారు. నవ్వుతూనే చెడుపై మంచి విజయం సాధిస్తుందని ధీమాతో అడుగులు వేసి, బయటకు రాగలిగారు.
అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. నాటి నుంచి ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వస్తున్నది. ఇక అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతానని కవిత గతంలో ప్రకటించారు. ఆయన దేశంలో ఎక్కడ పోటీ చేసినా, అక్కడికి వెళ్లి మరి ఓడిస్తానని ప్రకటించారు. తాను చివరి వరకు నిజామాబాద్ లోనే ఉంటానని, ఇక్కడి ప్రజలతోనే ఉంటానని ప్రకటించారు.
ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లకీ పోటీ చేస్తారని, కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. అయితే అర్వింద్ ను ఓడించడానికి ఇప్పటికే పక్కా వ్యూహంతో కవితక్క ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల నిజామాబాద్ లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. అర్వింద్ ఓటమే లక్ష్యంగా ఆమె పక్కా ప్రణాళిక మేరకు దిగుతున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా అదేస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇది ఎటు దారితీస్తుందో తెలియడం లేదు. అలా అని అర్వింద్ మీద కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం ఏం లేదు. పసుపుబోర్డు హామీతో గత ఎన్నికల్లో లాభపడ్డా, ఈసారి ఆయనపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో కనిపిస్తున్నది. పసుపు బోర్డు హామీ మరిచిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరులో కాంగ్రెస్ లాభపడే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.