
Kavitha arrest : తెలంగాణలో మొన్నటి వరకు దూకుడు మీదున్న బీజేపీ రాబోయే తమ ప్రభుత్వమేనంటూ జబ్బలు చరుచుకుంది. ఒక్కసారిగి బీజేపీ గ్రాఫ్ డౌన్ ఫాల్ కావడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ర్టంలోనూ అధికార పార్టీకి సవాల్ విసురుతున్న కమలదళంలో జోష్ కనిపించడం లేదు. ఒక్క సారిగా బీజేపీ డీలా పడిపోవడం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని హస్తం నేతలు చేస్తున్న ఆరోపణలు కాషాయ దళం జోష్ ను నీరుగారుస్తున్నాయి.దీనికి ప్రధాన కారణం బీజేపీ ఆయుధాలుగా చెప్పుకునే సీబీఐ, ఈడీ, ఐటీ ఒక్క సారిగా సైలెంట్ కావడమేనని తెలుస్తున్నది. బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా అడుగు పెట్టాలనుకుంటే ఐటీ, ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుంది. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో ఇంకా అందరి కళ్ల ముందే ఉంది. ఆ స్థాయిలో కాకపోయినా అందులో కొంత మేరకు ముందుకు సాగినా ఇప్పటికే బీఆర్ఎస్ లోని సగం మంది నేతలు బీజేపీలో చేరిపోయేవారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. కానీ బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటిపోయాయి.
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ కుటుంబం జైలుకే అంటూ ప్రెస్ మీట్లలో బండి సంజయ్ చేస్తున్న హడావుడికి అంతాఇంతా కాదు. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ఆధారంగా కేంద్రంలోని బీజేపీ చేసిన షో అంతా ఇంతా కాదు. ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ క్వీన్ అని హ్యాష్ ట్యాగ్ లు పెట్టి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. ఇక రేపోమాపో అరెస్టే మిగిలిందంటూ ఊదరగొట్టారే తప్ప ఇప్పటి దాకా చేసిందేమీ లేదు. బీజేపీ నాయకులు ఆ మాటే ఎత్తడం లేదు. దీంతో బీజేపీ హైప్ అంతా నీరుగారిపోయింది.
తెలంగాణ బీజేపీ నేతల్లో నిస్తేజం కనిపిస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఒకవేళ బీజేపీ ఎదగాలనుకుంటే.. ఈపాటికే కవితను అరెస్ట్ చేసి ఉండేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసిన విధానం అంతా ఇంతా కాదు. తన వద్ద ఉన్న పోలీస్ పవర్ తో ఏకంగా బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి కూడా ఒక దశలో వెనకాడలేదు. ఇంత చేసినా బీఆర్ఎస్ తో బీజేపీ రాజీ పడిందేనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. చివరికు కేసీఆర్ మరోసారి గెలిచినా పర్వలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదనే కాన్సెప్ట్ తో బీజేపీ ముందుకు సాగుతున్నాదనే అభిప్రాయం ప్రజల్లోకి చేరింది.
ఇప్పుడు బీజేపీ నేతలకు ఏ దారి కనిపించడం లేదు. నడ్డా వచ్చి విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. బీజేపీ ఇప్పటికిప్పుడు వ్యూహాన్ని మార్చుకొని.. తెలంగాణ లో అధికార పార్టీపై దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా స్వయంకృతమా..? రెండు పార్టీల మధ్య అండర్ స్టాండింగా అనేది త్వరలో తేలనుంది.